హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు. ఇవన్నీ తెలిసినా కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని రేవంత్‌రెడ్డి.. అదే నిజమైతే రాజీనామా చేస్తానని కిషన్‌రెడ్డి.. అసలు రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాయలేదని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు ఒకరిపై ఒకరూ ఆరోపణలు గుప్పించుకుంటున్నరు. పత్రికలు సైతం ప్రముఖంగా ప్రచురిస్తున్నయి’ అని విమర్శించారు. ఎవరిని మోసం చేసేందుకు ఈ డ్రామాలు, ప్రజలను పిచ్చోళ్లు అనుకుంటున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. జలయజ్ఞంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించి 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మిస్తామని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించారని తెలిపారు. ‘2013లో ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్‌కు లేఖ రాశారు. కానీ ఆయన ఒప్పుకోకుండా ఈ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు నిష్ఫలమని ప్రత్యుత్తరమిచ్చారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ సైతం వ్యతిరేకించించింది’ అని గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ తమ్మిడిహట్టి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ఎంతగానో ప్రయత్నించారని వినోద్‌కుమార్ చెప్పారు. 2015 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముంబైకి వెళ్లి అప్పటి మహారాష్ట్ర సీఎంను బతిమాలినా ఆయన ఒప్పుకోలేదని తెలిపారు. తమ రాష్ట్రంలో 22 గ్రామాలు, 2 వేల హెక్టార్లు ముంపునకు గురవుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడామంటూ ఫడ్నవీస్ తమకు చెప్పారని అన్నారు. అయినప్పటికీ పట్టువిడువకుండా తామందరం ముంబైలో అప్పటి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు నివాసంలో ఐదురోజులు బస చేశామని తెలిపారు. విద్యాసాగర్‌రావు ద్వారా యత్నించినా అప్పటి మహారాష్ట్ర సీఎం అంగీకరించలేదని చెప్పారు. ఇక గత్యంతరంలేక నిపుణులతో రాత్రింబవళ్లు చర్చించి మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్ నిర్మాణానికి ఉపక్రమించారని వివరించారు.
తమ్మిడిహట్టికి అనుమతులు సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సీఎంతో ఘర్షణకు దిగడాన్ని వినోద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. పాలకులు మారుతుంటారని, కానీ ప్రభుత్వాలు శాశ్వతమనే విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర సర్కార్‌ను ఒప్పించాలని, కానీ సంబంధంలేని కిషన్‌రెడ్డి, రామచందర్‌రావుపై నెపంనెట్టి తప్పించుకోవాలని చూడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గతంలో ఆరు నెలల్లో తమ్మిడిహట్టికి పర్మిషన్ తీసుకొస్తానని బండి సంజయ్ చెప్పారని గుర్తుచేశారు. కానీ ఏడాది దాటినా అతీగతీలేదని మండిపడ్డారు. ‘ఏది ఏమైనా సీఎం రేవంత్‌రెడ్డికి మేడిగడ్డ రిజర్వాయరే దిక్కు.. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆప్షన్..’ అని తేల్చిచెప్పారు. మేడిగడ్డ కొట్టుకుపోవాలని రెండున్నరేండ్లుగా రేవంత్‌రెడ్డి ఎదురుచూశారని ఆరోపించారు. కానీ ఆ రిజర్వాయర్‌కు చెందిన రెండు పిల్లర్లు కుంగడం తప్ప ఏమాత్రం చెక్కుచెదరలేదని స్పష్టంచేశారు. ఇక దిక్కుతోచని స్థితిలో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టారని విమర్శించారు. ఎల్‌నినో కారణంగా కరువు తరుముకొస్తున్నదనే వార్తల నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పిచ్చి పనులు, పనికిరాని నాటకాలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు.