హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకుండా ఆయిల్‌పామ్ సాగులో నిర్లక్ష్యం వహిస్తున్న కంపెనీలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఆయిల్‌పామ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకొని ఆయిల్ఫెడ్తోపాటు 13 ప్రైవేట్ ఆయిల్‌పామ్ కంపెనీలు పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2.72 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతున్నదని, వచ్చే మూడేండ్లలో 10 లక్షల ఎకరాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషాను ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): నార్త్అమెరికాలోని బార్బడోస్ దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర ప్రతినిధుల బృందం వెళ్లింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దంపతులు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ దంపతులు, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు తదితరులు బయల్దేరి వెళ్లారు. ఈనెల 11వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో వారు పాల్గొంటారు. ఈ ప్రతినిధుల బృందం యూకే, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలలో పర్యటించనున్నది.