హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు చెప్పుకొచ్చారు. రైతులు కేవలం ఆతృతతో ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిలుచుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని 12,000 సెంటర్లలో ఎక్కడో రెండు, మూడు చోట్ల రైతులు క్యూలో నిలుచున్న పరిస్థితులు ఉన్నాయని శాసనమండలిలో చెప్పారు. ‘యూరియా కోసం మొబైల్ యాప్’ అంశంపై శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు యూరియా సమస్యలపై వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ తిరస్కరించారు.
యూరియా కొరత లేదని, మార్క్ఫెడ్ వద్ద దాదాపు 2.50 లక్షల వరకు బఫర్ స్టాక్ ఉందని మంత్రి తుమ్మ ల పేర్కొన్నారు. యాప్ ద్వారా యూరి యా పంపిణీ వ్యవస్థ విఫల ప్రయత్నమని తక్కెళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. గ్రామాలలో రైతులు యూరియా కోసం కొత్తగా స్మార్టు ఫోన్లు కొనుగోలు చేయాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బీఆర్ఎస్ సభ్యుడు దాసోజుశ్రవణ్ సూచించారు.