హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో ప్రతి జిల్లాలో 10 చొప్పున డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో, గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో), పీఏసీఎస్‌కు అందచేయడానికి నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. 2025-26 సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 9936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీపై రైతులకు అందించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ): మహిళా భద్రత, సాధికారతకు కాంగ్రెస్ సర్కార్ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగు లకు జీపీఎస్ ఆధారిత రవాణా సౌకర్యం కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.