హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెలలో రైతులకు యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు అవసరమైన యూరియాను కేంద్రం నుంచి తెప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రానికి నెలవారీగా కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తకువగా పంపిణీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ర్టానికి అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని తెలిపారు.
జూన్ నెలకు సంబంధించి రాష్ట్రానికి 1.71లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, కేవలం 67వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని తెలిపారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కూడా కేటాయించిన దానికంటే 1.21 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం తకువగా సైప్లె చేసిందని, మొత్తంగా 3 నెలలకుగాను 2.25 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నదని ఆయన లేఖలో వివరించారు.