హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ ప్రభుత్వం అదే వివక్ష కొనసాగిస్తున్నది. ఏపీ ప్రజాప్రతినిధులకు వారంలో 4 రోజులు.. ప్రతిరోజు 1 బ్రేక్, 1 ప్రత్యేక దర్శనాలకు (సుపథం) టీటీడీ అనుమతి ఇస్తున్నది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు వా రంలో 2 రోజులు మాత్రమే సిఫారసు లేఖలకు అనుమతించింది. వారం మొత్తంలో రెండు రోజుల్లో రోజుకు ఒకటి చొప్పున, రెండు వీఐపీ బ్రేక్, రెండు ప్రత్యేక దర్శనాలకు(స్థుపతం)కి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ సోమవారం నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి ఏపీలో మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల ఒత్తిడికి ఏపీ సర్కారు తాజాగా తలొగ్గింది. కానీ, కోటాకు కోతలు విధించి సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానాన్ని మార్చి 24 నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించాల్సి ఉన్నా.. టీటీడీ తాత్సారం చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు టీటీడీ సిఫారసు లేఖలపై దర్శనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, నామమాత్రంగానే కోటా కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారాల్లో (సోమ, మంగళవారం దర్శనాలకు) మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలకు (ఏ రోజుకు ఆ రోజే లేఖలు) అనుమతిస్తామని పేర్కొన్నది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ మాత్రమే (ఆరుగురు భక్తులకు మించకుండా) స్వీకరిస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలు ఇకపై శనివారం నాడు(ఆదివారం దర్శనం కోసం) స్వీకరించనున్నట్టు తెలిపింది. తిరుమలలో సౌకర్యాలను, దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరింది.