జనగామ చౌరస్తా, డిసెంబర్ 28 : ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య వేడుకల మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహించారు. స్థానిక నెహ్రూపార్కు నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాంగళ్య వేడుకల మందిరం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. తొలిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, విశిష్ట అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ కే నాగేశ్వర్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నవారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ చదువుకొని పైకొచ్చిన వారేనని అన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ, డీఏలు, బదిలీలు, పదోన్నతులు వంటి కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నది వాస్తమేనని అంగీకరించారు. ఆదర్శ పాఠశాలల్లో కారుణ్య నియామకాలు, గురుకుల పాఠశాలల పని వేళల సవరణ వంటి సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, క్యాబినెట్లో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒకరూ మంచిగా చదువుకుంటే రాజ్యాంగం కల్పించిన హక్కులతో తనలా ఎదిగే అవకాశం ఉంటుందని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించినట్టు తెలిపారు. గత రెండు, మూడేండ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలా అత్యుత్తమమైన ప్రతిభావంతులని కొనియాడారు. ప్రస్తుతం 60 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్‌కు, కేవలం 40 శాతం మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువులు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉన్న లోపాలను సరిచేసుకొని ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలని సూచించారు. యూటీఎఫ్ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన సంఘం అని తెలిపారు. విద్యార్థులకు పాఠాలు బోధించడంలో, ఉద్యమాలు చేపట్టడంలోనూ ఈ యూనియన్ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి సీతక్కకు ఉపాధ్యాయుల పక్షాన పల్లా విజ్ఞప్తి చేశారు.