హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్యను పెంచనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే సంస్థ కొనుగోలు చేసిన అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి రోడ్డెక్కనున్నాయి. వీటిని హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేదర్ విగ్రహం వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
వీటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. మిగతా 970 బస్సుల్లో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. వీటికితోడు హైదరాబాద్ సిటీలో 540, ఇతర ప్రాంతాలకు 500 పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఈ ఏడాదిలోనే వాడకంలోకి తేనున్నది.