TSRTC | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పోలీస్, రవాణాశాఖలు సహకరిస్తున్నాయని చెప్పారు.
ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించారు. గత దసరా కన్నా ఈసారి వెయ్యి బస్సులను అదనంగా తిప్పుతున్నట్టు తెలిపారు. ఈసారి ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని సజ్జనార్ స్పష్టంచేశారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) జీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్సైట్ tsrtconline.inలో చేసుకోవాలని సజ్జనార్ కోరారు. పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్‌సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.