గ్రూప్-2 పరీక్ష జరిగి.. ఎప్పుడెప్పుడు ఉద్యోగాల్లో చేరుదామని అభ్యర్థులు ఎదురుచూస్తుంటే కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కాసుల కోసం కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళన బాటపట్టిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు చిత్తశుద్ధితో కోచింగ్ ఇవ్వాల్సిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులే.. పరీక్ష వాయిదాపడేందుకు అభ్యర్థులకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ వారిని రోడ్డుపైకి తీసుకొస్తున్నారు. గ్రూప్-2 పరీక్షకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 500 మందే ఆందోళన చేయడం వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతున్నది. పరీక్ష వాయిదాపడితే ఒక్కో అభ్యర్థిపై దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేలు అదనపు భారం పడనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ గ్రూప్-2 షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సుమారు 6 నెలల ముందే పరీక్ష తేదీలను వెల్లడించింది. అప్పటి నుంచి ఏమీ మాట్లాడకుండా.. తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పరీక్షను వాయిదా వేయాలని కొందరు కోరుతున్నారు. ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తేదీలేవీ అందుబాటులో లేవని, అందులోనూ ఎన్నికలు ఉన్నందున వాయిదా వేస్తే.. మళ్లీ ఈ ఏడాది నిర్వహణ కష్టమేనని ఆయన వివరించారు. అయినా.. మళ్లీ గ్రూప్-2 వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సీ వద్ద హల్చల్ చేశారు. అక్కడ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కనిపించడం, వారే అభ్యర్థులను గైడ్ చేయడం అందరిలోనూ సందేహాలను రేకెత్తిస్తున్నది. కొందరు నిర్వాహకులు అభ్యర్థులను పక్కదారి పట్టించి పరీక్షలను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కోచింగ్ సెంటర్ల దుర్మార్గపు ఆలోచనలకు కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తోడయ్యారు. తమ రాజకీయ స్వార్థం కోసం అభ్యర్థులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
కొందరి స్వార్థం.. లక్షల మందికి ఇబ్బంది!
తెలంగాణలో గ్రూప్-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. అత్యధికంగా 5,51,943 దరఖాస్తు చేశారు. 5.51 లక్షల మందిలో నాలుగైదు వందల మందే పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. మిగతా 5 లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం అవుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అంటున్నారు. సాధారణంగా నియామక సంస్థలు ఒక పరీక్ష తేదీని ప్రకటించిన తర్వాత. విపత్తులు వస్తే తప్ప ఆ పరీక్ష తేదీలో మార్పులు చేయవు. యూపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అనేక రాష్ర్టాలు గతంలో డిమాండ్ చేసినా.. పరీక్ష తేదీల్లో మార్పు చేయలేదు.
పరీక్ష వాయిదాపడితే అభ్యర్థులకే నష్టం
గ్రూప్-2 పరీక్ష కోచింగ్ కోసం సుమారు రూ.20 వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. కొన్ని పేరున్న కోచింగ్ సెంటర్లలోనైతే రూ.35 వేల నుంచి రూ.45 వేలు తీసుకొంటున్నారు. ఒక అభ్యర్థి మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ కోచింగ్ కోసం వస్తే రూం, భోజనం అన్నీ కలిపి నెలకు మరో రూ.5 వేల నుంచి రూ. 10 వేలు అవుతుంది. అంటే.. ప్రస్తుతం గ్రూప్-2 పరీక్ష వాయిదా పడితే సగటున ఒక అభ్యర్థి మరో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-2కు దరఖాస్తు చేసిన వారిలో సుమారు 95 శాతానికి పైగా అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయొద్దని కోరుతున్నారు. గ్రూప్-2 పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండురోజులు పరీక్ష కేంద్రాలు ఉన్న సెంటర్లకు సెలవు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది.