కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలు, రోస్టర్ పాయింట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నియామకాలు ఆలస్యమవుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖలన్నింటికీ లేఖలు రాశాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో, ఏయే కారణాలతో అభ్యర్థులు కోర్టుకెళ్తున్నారో గుర్తించి ఆయా కారణాలన్నింటినీ ఆయా లేఖల్లో ప్రస్తావించాం. నోటిఫికేషన్ల కోసం టీఎస్పీఎస్సీకి ఇండెంట్‌ను పంపించేటప్పుడే పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించాం.
– టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 10 : ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవాలని, ఆందోళనకు తావు లేకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలని తెలిపారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా నోటిఫికేషన్ల షెడ్యూల్స్‌ను రూపొందిస్తున్నామని, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రిపేర్ కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యం లో ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్న పారదర్శక విధానాలు, అవలంబిస్తున్న సంస్కరణలను వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మధ్యవర్తులను నమ్మొద్దు
ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులెవరూ మధ్యవర్తులను నమ్మొద్దు. వదంతులను విని మోసపోవద్దు. మీ ప్రతిభను మాత్రమే నమ్మకోండి. అలా నమ్మకం కలిగించేలా కమిషన్ పనిచేస్తుంది. ఇంటర్వ్యూల్లో పక్షపాతానికి తావులేకుండా, అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు తీసుకొంటున్నాం. అభ్యర్థి, పేరు, కులం, మతం వంటి వాటితో ప్రమేయం లేకుండా కోడ్ నంబర్ ఇచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం. కంప్యూటర్ ఆధారిత ర్యాండమ్ సెలక్షన్‌ను అవలంబిస్తున్నాం.
30 వేల లోపుంటే ఆన్లైన్ పరీక్ష
పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 30 వేల లోపుంటే ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తాం. గతంలో ఇంజినీరింగ్ పోస్టులకు ఈ విధంగానే నిర్వహించాం. దీనివల్ల నియామక ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది. మిగిలిన పరీక్షలకు అంటే ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే వాటికి భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉండటం వల్ల ఆన్లైన్ విధానంలో నిర్వహించలేకపోతున్నాం. భవిష్యత్తులో సాంకేతికతను వాడుకొని వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను పూర్తిచేస్తాం. పోటీ పరీక్షలు ముగిసిన 2, 3 రోజుల్లోనే కీ పేపర్‌ను వెల్లడిస్తున్నాం. కీ పేపర్‌ను సవాల్‌చేసే అవకాశాన్నిచ్చి, అభ్యంతరాలను స్వీకరించి, తప్పులుంటే నిపుణుల కమిటీ పర్యవేక్షణలో సవరిస్తున్నాం. ఈ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నాం. మెరిట్ లిస్ట్‌ను ప్రకటించి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్‌లను విడుదల చేస్తున్నాం. ఇలాంటి విధానం యూపీఎస్సీలోనూ లేదు.
దరఖాస్తు ఫీజులు పెంచం.. సిలబస్ మార్చం
పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజులను పెంచం. పాత ఫీజులే కొనసాగుతాయి. భవిష్యత్తుల్లో పెంచే ఆలోచన లేదు. రిజర్వ్డ్ అభ్యర్థులకు ఫీజు రాయితీ కొనసాగుతుంది. పోటీ పరీక్షల సిలబస్ మార్చే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వం ఆమోదించిన సిలబస్‌నే కొనసాగిస్తాం. సిలబస్‌ను మాటిమాటికి మార్చడం కుదరదు. మార్చాలంటే మూడేండ్ల ముందుగానే నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుంది. ఇప్పట్లో మార్చే ప్రసక్తే లేదు. అన్ని రిజర్వేషన్లు, వయోపరిమితిని అమలుచేస్తాం. గ్రూప్ పరీక్షల్లో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, కామర్స్ ఇలా ఏ సబ్జెక్టులు చదివినా సమాన అవకాశాలు ఉండేలా టీఎస్పీఎస్సీ సిలబస్‌ను రూపొందించింది.
ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు
టీఎస్పీఎస్సీ పనితీరు సహా అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మాకు చెప్పొచ్చు. ఇబ్బందులను వివరించొచ్చు. ఇందుకోసం టీఎస్పీఎస్సీలో ఫీడ్‌బ్యాక్ ఆప్షన్‌ను అభ్యర్థులు వినియోగించుకోవాలి. కమిషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు సైతం పనిచేస్తాయి. అన్ని రకాల సమాచారం, వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
శాఖలకు లేఖలు
కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలు, రోస్టర్ పాయింట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నియామకాలు ఆలస్యమవుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖలన్నింటికీ లేఖలు రాశాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో, ఏయే కారణాలతో అభ్యర్థులు కోర్టుకెళ్తున్నారో గుర్తించి ఆయా కారణాలన్నింటినీ ఆయా లేఖల్లో ప్రస్తావించాం. నోటిఫికేషన్ల కోసం టీఎస్పీఎస్సీకి ఇండెంట్‌ను పంపించేటప్పుడే పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించాం. అభ్యర్థులు కూడా ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారు. బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం, ఆ తర్వాత కోర్టుకెళ్లడం జరుగుతున్నది. ఆ తప్పులను చేయొద్దని ముందే అభ్యర్థులకు చెప్తాం. కొత్త నోటిఫికేషన్లు రాబోతున్న క్రమంలో రాష్ట్రంలోని ఉద్యోగార్థులందరికీ ఆల్ ది బెస్ట్.
గ్రూప్ -1కు ఈ-క్వశ్చన్ పేపర్
గ్రూప్ -1 మెయిన్ అభ్యర్థులకు ప్రస్తుతమిస్తున్న ప్రశ్నపత్రాల స్థానంలో ఈ-క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నాం. ప్రశ్నపత్రాలను ముద్రించడం, పంపిణీ, పరీక్ష కేంద్రాలకు చేర్చడంలో ఎక్కడో ఒక దగ్గర పేపర్లు లీకయ్యే అవకాశాలున్నాయి. దీనికి పరిష్కారంగా ఈ-క్వశ్చన్ పేపర్‌ను ఇవ్వనున్నాం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నిర్వహించిన అర్ధవార్షిక పరీక్షల్లో ఈ-క్వశ్చన్ పత్రాలను అమలుచేశాం. దీంట్లో భాగంగా అభ్యర్థులకు ట్యాబ్, ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తాం. అభ్యర్థులకు కోడ్ నంబర్ కేటాయించి, ఆయా కోడ్‌తో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసుకొనే అవకాశాన్నిస్తున్నాం. సమాధానాలను మాత్రం పెన్, పేపర్ విధానంలోనే రాయాల్సి ఉంటుంది.
స్థానికత ఆటోమెటిక్‌గా మార్పు
వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో ఇప్పటి వరకు 24.92 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుతో అభ్యర్థుల స్థానికత మారింది. ఈ మేరకు ఓటీఆర్‌లో మార్పులు చేయాల్సి ఉన్నది. ఇందు కు సంబంధించిన ఆప్షన్‌ను త్వరలోనే ఇస్తాం. అభ్యర్థులు 1 -7వ తరగతి వరకు ఎక్కడ చదివారో ఓటీఆర్‌లో పొందుపరిస్తే, వారు ఏ జిల్లా, జోన్, మల్టీజోన్కు చెందినవారో ఆటోమెటిక్‌గా మారుతుంది. అలా ఓటీఆర్‌లో మార్పులు చేశాం. ఓటీఆర్‌లో సెల్‌నంబర్, ఈమెయిల్ ఐడీని మార్చొద్దు. వాటికే నోటిఫికేషన్ల వివరాలను పంపిస్తాం.