హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఏపీలో అధికార వైపీసీ మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరించి, పిచ్చికూతలు కూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రులు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆత్మహత్యలు ఆగిపోయి, బంగారు పంటలు పండుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ‘మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే, పరిపాలనపై అవగాహన ఉంటే ముందు రాజధాని నిర్మించుకోండి’ అని ఏపీ మంత్రులకు ఎర్రోళ్ల సవాల్ విసిరారు. హరీశ్‌రావు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని హుందాగా వివరిస్తే, ఏపీ మంత్రులు సైకోల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ‘సీఎం కేసీఆర్ గారికి హాట్సాప్’ అని చెప్పిన సంగతిని గుర్తు చేశారు.