హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే’ అని అర్వింద్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అర్వింద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్‌పైన అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టయితే వెంటనే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అర్వింద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశాలున్నాయని గతంలోనే నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు అర్వింద్ మాటలతో అది పూర్తిగా నిజమేనని అనిపిస్తున్నదని చెప్పారు.