హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఉద్యమ పునాదుల్లో ఒకటైన నియామకాల కోసం లాఠీదెబ్బలు తిన్న, జైలు కెళ్లిన విద్యార్థి ఉద్యమ నాయకులుగా చెప్తున్నాం.. డిసెంబర్ 4న మంత్రి కేటీఆర్‌తో కలిసి అశోక్‌నగర్‌లో కూర్చుందాం. జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయిద్దాం. ప్రణాళికాబద్ధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను కాపాడుకుందాం’ అని తెలంగాణ యువతకు విద్యార్థి ఉద్యమ నాయకులు భాస్కర్, మానవతారాయ్, దరువు ఎల్లన్న పిలుపునిచ్చారు.
సోమవారం తెలంగాణభవన్‌లో భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాకతో విద్య, వైద్య, వ్యవసాయం, సంక్షేమం, ఐటీ రంగాల్లో సమూల మార్పులొచ్చాయని వివరించారు. నిరుద్యోగాన్ని పారదోలేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నదని, ప్రైవేట్ సెక్టార్లో లక్షల ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందో కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యూనివర్సిటీల విద్యార్థులను తాగుబోతులు, ఆడ్డామీద కూలీలతో రేవంత్‌రెడ్డి పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన పోరాటం రాకాసుల పాలుకావొద్దు
కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలు అడిగితే కేసులు బనాయించి, జైల్లో పెట్టారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 60 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందని దరువు ఎల్లన్న చెప్పారు. మన పోరాటం రాకాసుల పాలు కావొద్దని పిలుపునిచ్చారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ.. ఆరునెలలు గడుస్తున్నా రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మానవతారాయ్ విమర్శించారు. బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాలపై దమ్ముంటే కోదండరామ్, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు.