బెజ్జంకి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా కాపీ కొట్టారు. రైతు బంధు పథకాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారు. అదే స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, చీలాపూర్, బెజ్జంకి గ్రామాలలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీకి నిజంగా వారిపై ప్రేమ ఉంటే వారి అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.. మార్చి 31వ తేదీలోపు గ్రౌండింగ్ చేసి.. ప్రతి నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.. దళిత బంధు ప్రవేశ పెట్టినప్పుడు ఇది హుజూరాబాద్ కే పరిమితమని భాజపా నాయకులు ఎద్దేవా చేసి వికట ఆనందం పొందారని గుర్తుచేసిన హరీశ్ రావు.. రెండేండ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేకున్నా దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ లో దళిత బంధు పథకానికి 25 వేల కోట్లు కేటాయించి లబ్దిదారులకు పెద్ద ఎత్తున లబ్ది కలిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ దళితుల మీద బీజేపీ నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం నుంచి దళిత బంధు పథకానికి నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మిగతా తెలంగాణ పథకాల లాగే దళితబంధును కాపీ కొట్టి.. దేశవ్యాప్తంగా ఉన్న దళితులకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని అన్నారు.
రాష్ట్రంలో రెండేండ్లు ఎలాంటి ఎన్నికలు లేవు. అయినప్పటికీ మేనిఫెస్టోలో లేకున్నా తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేసుకొస్తున్నది. హామీ ఇచ్చిన పథకాలనే కాదు.. ప్రజా అవసరాలను గుర్తించి హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 9.96 లక్షల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థికసాయం అందించాం. కుల, మత, ఓట్ల రాజకీయం బీజేపీది అయితే.. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ పనిచేస్తున్నది.
70 ఏండ్లలో తెలంగాణలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ఒక్క డిగ్రీ గురుకులం కూడా లేదు. దళితుల కోసం గురుకుల లా కాలేజీ, పీజీ కాలేజీ తెచ్చినం. ఎస్సీ పాఠశాలలను ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ చేయించినం. దేశంలోనే తొలిసారిగా దళితుల కోసం లా కాలేజీ తెచ్చిన ఘనత తెలంగాణదే. ప్రస్తుతం రాష్ట్రంలో 53 మహిళ గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టి దళిత, గిరిజన ఆడబిడ్డలకు చదువు చెప్పిస్తున్న ఘనత కేసీఆర్‌దే. దళితులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెట్టాలి. దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలి. దేశం మొత్తం గురుకుల పాఠశాలలు, కాలేజీలు పెట్టాలి.
పనిచేసే ప్రభుత్వంపై బురద జల్లితే మీరే అభాసుపాలు అవుతారు. మీరు కొట్లాడుతున్నది దేనికోసమో సోయితోనే కొట్లాడుతున్నారా? 317 జీవో రద్దు చేయమంటారు. జీవోను రద్దు చేయడం అంటే స్థానికులకు ఉద్యోగాలను వద్దు అనడమే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడమే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడమే. సోయితోనే మాట్లాడుతు న్నారా? కేంద్రం ఆమోదంతోనే ఈ జీవో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తమ ఉద్యోగుల జీతాలలో కోత విధిస్తే …. 4-10 వేల జీతం తగ్గించారు. మేము 30 శాతం జీతం పెంచాం. దేశంలో అత్యధిక జీతం ఇస్తుందే తెలంగాణ.
317జీవో ఉద్దేశ్యం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నదే. జీవోతో అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు ఉంటాయి. అందరికీ కరీంనగర్ అంటే స్థానిక జిల్లా నిరుద్యోగ యువత పరిస్థితి ఎంటి. బండి సంజయ్ నీకు ఓట్లేసి గెలిపించిన యువతకే నష్టం చేస్తున్నావు. సర్వీస్ లో ఉన్న సీనియర్ లకు మొదటి ఛాయిస్ తో కోరుకున్న చోటికి బదిలీ చేశాం. చాలా సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి వయసు పై బడ్డ సీనియర్ మోస్ట్ , బీపీ ,షుగర్, గుండె జబ్బులు కలిగిన సీనియర్ లకు కోరుకున్న చోటికి బదిలీ చేశాం. జూనియర్లను, కొత్తగా సర్వీసులో జాయిన్ అయిన వారికి ఇతర పక్క జిల్లాలకు బదిలీ చేశాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్లాడుతుంటే.. ఉద్యోగుల విభజన జరగకూడదని కోర్టులో స్టే రావాలని , తద్వారా నాలుగు ఓట్లు వెనకేసుకోవాలని బండి సంజయ్ తాపత్రయపడుతున్నారు.
యువత, ఉద్యోగస్తులు ఓసారి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల కేటాయింపు జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లాగా మేము ఉద్యోగుల వేతనాలు తగ్గించలేదు. దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చేది తెలంగాణనే. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం ఫిట్ మెంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉద్యోగులపై ప్రేమ ఉంటే 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.
బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులను కార్మికులను అణచివేస్తుంది. పైగా వారి మీద ప్రేమ ఉన్నట్టు కపట నాటకమాడుతుంది. ఉద్యోగులపై మీది నిజమైన ప్రేమ అయితే ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వండి. సింగరేణి కార్మికులకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వండి. ఉద్యోగులకు ఆదాయ పన్ను పరిమితిని 6 లక్షలకు పెంచాలి. కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు ముక్కు పిండి ఇన్‌కం టాక్స్ కేంద్రం వసూలు చేస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఉద్యోగుల ఆదాయపు పన్ను పరిమితిని ఆరు లక్షలకు పెంచాలని కోరుతున్నాను. తద్వారా రాష్ట్రంలోని 50 శాతం మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.