హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ బోర్డు నిర్వహణకు అవసరయ్యే బడ్జెట్ను ఇరు రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో భరించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.24 కోట్లు అవసరమని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ, ఏపీలు రూ.12 కోట్ల చొప్పున నిధులను విడుదల చేయాలి. అయితే ఇరు రాష్ర్టాలు ఇప్పటివరకు ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదు. ఇప్పటివరకు బోర్డుకు సంబంధించిన కార్పస్ ఫండ్ నుంచి జీతాల చెల్లింపు, నిర్వహణ ఖర్చులకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆ నిధులు కూడా ఖాళీ అయ్యాయి. వచ్చే నెల జీతాలు ఇవ్వడానికి సైతం నిధులు లేవని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ రాసింది.
కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించేందుకు ఫేజ్2లో భాగంగా 9 ముఖ్యమైన ప్రదేశాల్లో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్లతో (ఎస్ఎల్డీసీపీ) టెలిమెట్రీ స్టేషన్లను ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. అందుకు రూ.7.18కోట్లు అవసరమవుతాయని బోర్డు అంచనా వేయగా, తెలంగాణ సర్కారు రూ.4.18 కోట్లను బోర్డుకు విడుదల చేసింది. ఏపీ సర్కారు మాత్రం విడుదల చేయలేదు. దీం తో టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తెలంగాణ కేటాయించిన ఆ నిధులను సైతం బోర్డు నిర్వహణకు వినియోగించుకుంటామని కేఆర్ఎంబీ వెల్లడించింది. దీంతో నీటిపారుదలశాఖ ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరిస్తూ లేఖ రాసింది. బోర్డు నిర్వహణకు రూ.6కోట్లను విడుదల చేయాలని, లేకుంటే టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు నిధులు వినియోగించుకునే ప్రమాదముందని వెల్లడించింది.