Degree Colleges | ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెనుకబడిన వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి సీఎం కేసీఆర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్ పేర్కొన్నారు.
గతంలో వర్గల్ కాలేజీకి అదనంగా 2022–23 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని క్లాసులను ప్రారంభించుకున్నామని, ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలున్నాయన్నారు. తాజాగా జిల్లాకొక డిగ్రీ కాలేజీకి ముఖ్యమంత్రి అనుమతిస్తూ మరో 17డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం బీసీలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యం వైపు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడానికి నిదర్శనమన్నారు. గత విద్యా సంవత్సరంలోనే నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాల్ని సైతం ప్రారంభించామన్నారు.
కేసీఆర్ సారథ్యంలో అన్నిరంగాల్లో స్వర్ణయుగం సాధిస్తున్నామని, గతంలో కేవలం 19 గురుకులాలు, 7వేలమంది విద్యార్థులకు మాత్రమే గురుకుల విద్య అరకొరగా అందుతుండేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో గురుకులాలను దశలవారీగా 327కి పెంచిందన్నారు. బీసీ గురుకులాల్లో ప్రతీ ఏడు ఇంగ్లిష్ మీడియంలో చదివిన 1,68,000 పైచీలుకు వెనుకబడిన వర్గాల బిడ్డలు నేడు అన్ని పోటీపరీక్షల్లోనూ తమ సత్తా చాటుతూ తెలంగాణ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగిరేయడం సంతోషంగా ఉందన్నారు.