హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2,558 మంది ఉపాధ్యాయుల బదిలీలకు తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జోనల్, మల్టీజోనల్, జిల్లా క్యాడర్లోని పలువురు ప్రధానోపాధ్యాయులు, టీచర్లను బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో-14ను జారీచేశారు. కొత్త జిల్లా, జోన్ల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతుల మేరకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఫిబ్రవరి 2న జీవో-21 జారీ అయ్యింది.
దీంతో పరస్పర బదిలీల కోసం విద్యాశాఖ నుంచే 5 వేలకు పైగా ఉద్యోగులు, టీచర్లు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, పరస్పర బదిలీ అయిన ఉద్యోగులు సీనియారిటీని కోల్పోతారని, కొత్త జిల్లాలో జూనియర్ అవుతారని జీవోలో పేర్కొన్నారు. ఈ రెండు నిబంధనలను సవరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో సీనియారిటీకి రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం మరో జీవో చేసింది. పరస్పరం బదిలీ అయిన ఇద్దరు ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలోనే కొనసాగితే.. వారి పాత జిల్లా సీనియారిటీని తిరిగి కొత్త జిల్లాల్లో కొనసాగించనున్నట్టు జీవో-402లో పేర్కొన్నారు.
అయితే ఈ జీవోపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాము సర్వీసు కోల్పోయినా ఫర్వాలేదని, తమను బదిలీచేయాలని కోరుతూ.. 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంగీకారపత్రాలు ఇచ్చారు. అంగీకారపత్రాలు ఇచ్చినవారిని పరస్పరం బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్వీస్ ప్రొటెక్షన్ కోరుకొని, అంగీకారపత్రం సమర్పించని మరో 2,400 మంది భవితవ్యం హైకోర్టు తీర్పును అనుసరించి తేలనున్నది. ఈ కేసును సోమవారం విచారించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 18కి వాయిదావేసింది.
పరస్పర బదిలీలపై పీఆర్టీయూటీఎస్ హర్షం
పాఠశాల విద్యాశాఖలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం పట్ల పీఆర్టీయూటీఎస్ హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. జీవో 317 ప్రకారం వివిధ జిల్లాలకు కేటాయించిన టీచర్లను, పరస్పర అంగీకారంతో 2,558 మంది ఉపాధ్యాయులను తాము కోరుకున్న చోటికి బదిలీచేయడం చారిత్రాత్మకమని ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు పేర్కొన్నారు.
జీవో 317ప్రకారమే క్యాడర్ విభజన: పీఎంటీఏటీఎస్
మాడల్ స్కూల్ టీచర్స్‌ను జీవో 317 ప్రకారం విభజించి, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని ప్రొగ్రెస్సీవ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ టీఎస్) కోరింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు వినతిపత్రాన్ని సమర్పించింది. మాడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని, జీవో 317 అనుబంధ ఉత్తర్వులను రెండు రోజుల్లో విడుదల చేస్తామని కరుణ హామీనిచ్చినట్టు పీఎంటీఏ టీఎస్ తెలిపింది.
క్యాడర్ విభజన తర్వాతే బదిలీలు
మంత్రి సబిత హామీ ఇచ్చినట్టు టీఎంఎస్టీఏ వెల్లడి
కొత్త జిల్లాలు, జోన్ల వారీగా క్యాడర్ విభజన తర్వాతే మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలు చేపడుతామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీనిచ్చినట్టు తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కొంతం నగేశ్ తెలిపారు. బదిలీలకు సంబంధించి నిబంధనలు రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారని వారు వెల్లడించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో మంత్రి సబితతో భేటీ అయినట్టు వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి మంత్రితో మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై చర్చించామని వారు తెలిపారు.