గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:49

స్వయంగా వచ్చి రైతుబంధు డబ్బులు ఇస్తా

స్వయంగా వచ్చి రైతుబంధు డబ్బులు ఇస్తా

  • కొత్తపేట, ఇటిక్యాల రైతుల సమస్యను తీర్చండి
  • పది రోజుల్లో పాస్‌పుస్తకాలు అందించండి
  • అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం
  • గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో సంభాషణ

సీఎం కేసీఆర్‌ చొరవ.. 60 ఏండ్లుగా ప్రభుత్వ పథకాలు వర్తించని రైతుల సమస్యను తీర్చింది. రైతుల ఇబ్బంది తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. సంబంధిత అధికారులతో మాట్లాడటమేకాకుండా.. వారిని గ్రామానికి పంపి.. సదరు గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌ చేసి.. వివరాలు వాకబు చేశారు. తానే వచ్చి రైతుబంధు సొమ్ము అందజేస్తానని హామీ ఇచ్చారు.  

జగదేవ్‌పూర్‌: ‘కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల రైతుల భూసమస్యను పరిష్కరించండి. పదిరోజుల్లో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందించండి. నేనే వస్తా.. రైతులకు రైతుబంధు డబ్బులు అందజేస్తా’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం కొత్తపేట సర్పంచ్‌ వెంకట్రామ్‌రెడ్డికి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం కొత్తపేట సర్పంచ్‌తో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 600 మంది రైతులకు 524 ఎకరాల భూమి ఉన్నప్పటికీ, సీలింగ్‌ పట్టాగా రికార్డులలో నమోదైంది. దీంతో రిజిస్ట్రేషన్లు కాక, 60 ఏండ్లుగా ఈ రైతులెవరికీ ప్రభుత్వ పథకాలు వర్తించడంలేదు. 


స్వరాష్ట్రంలో రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా అందడం లేదని సర్పంచ్‌లు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. పలువురు నాయకుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం కొత్తపేటకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేయగానే గ్రామ సర్పంచ్‌ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడించారు. గ్రామ సమస్యలు ఏమున్నాయని సీఎం కేసీఆర్‌ అడుగగా, భూ సమస్యల గురించి వివరించారు. సమస్య తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే పరిష్కరించి, తానే స్వయంగా గ్రామానికి వచ్చి, రైతులకు రైతుబంధు డబ్బులు అందిస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్‌ తెలిపారు. వెంటనే కొత్తపేటలో రెవెన్యూ మేళా నిర్వహించాలని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని సర్పంచ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇటిక్యాల సర్పంచ్‌ రావికంటి చంద్రశేఖర్‌ కూడా అక్కడే ఉన్నారు.

వివరాలు సేకరించిన డీఏవో

సీఎం కేసీఆర్‌, కలెక్టర్‌ ఆదేశాలతో డీఏవో శ్రావణ్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారులతో కలిసి శుక్రవారం కొత్తపేటలో రైతుబంధుకు అర్హులైనవారి వివరాలు నమోదుచేసుకున్నారు. శనివారం గ్రామంలో రెవెన్యూ మేళా నిర్వహించనున్నట్టు సర్పంచ్‌లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో శనివారం కలెక్టర్‌ వెంకట్‌రామ్‌రెడ్డి గ్రామంలో పర్యటించనున్నారని, మూడు గ్రామాల రైతుల భూసమస్యలను పరిష్కరించనున్నారని సర్పంచ్‌లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో 60 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం లభించనున్నదని వారు సంతోషం వ్యక్తంచేశారు.


logo