అపి స్వర్ణమయీ లంకా/ నమే లక్ష్మణ రోచతే!
జననీ జన్మ భూమిశ్చ/ స్వర్గాదపి గరీయసి!!
రావణ వధ తర్వాత… స్వర్ణకాంతుల లంకను చూసి లక్ష్మణుడు, ‘అన్నా, లంక ఎంతో సుందరంగా ఉన్నది. మనం ఇక్కడనే ఉండొచ్చు కదా! మళ్లీ అయోధ్యకు ఎందుకు?’ అని అంటాడట. అందుకు రాముడు.. ‘లక్ష్మణా.. బంగారంతో నిండి ఉన్నప్పటికీ ఈ లంక నాకు ఇష్టం కాదు. నా తల్లి, నా జన్మభూమి నాకు స్వర్గం కంటే కూడా ఎక్కువ’ అన్నాడట!
దేశభక్తి అంటే నినాదం కాదు; దేశభక్తి అంటే రాజకీయం కోసం రగిల్చే ఉద్వేగం కాదు; దేశభక్తి అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం అంతకంటే కాదు. దేశభక్తి అంటే ఎన్నికల ముడిసరుకు కానేకాదు.
దేశభక్తి అంటే జన్మభూమితో భూమి పుత్రుడికి ఉండే దైవికమైన అనుబంధం. దేశ మాతపై ఉండే పుత్ర ప్రేమ. పుట్టిన ప్రాంతంపై ఉండే పితృ ప్రేమ. ‘నాకు తల్లివి నీవు నే నీకు తండ్రి’ అని దాశరథి అన్నట్టు కన్న నేల కడగండ్లు బాపాలన్న ఆరాటమే దేశభక్తి. తన దేశంలో అందరూ బాగుండాలన్న తాపత్రయమే దేశభక్తి.
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం పార్టీ ప్లీనరీలో చేసిన ప్రసంగం ఇలాంటి నిస్వార్థ, నిష్కల్మష, నిరపేక్ష దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం.
‘ఓ నా దేశమా.. ఇదేమి దుస్థితి’ అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన అక్షరాక్షరం నేటి దేశ పరిస్థితికి సాక్షీభూతం. మన దేశం మారాలని, అందుకు తన వంతుగా నడుం బిగిస్తానని కేసీఆర్ చేసిన శపథం.. 20 ఏండ్ల కింద తెలంగాణ కోసం కలగన్న పథాన్ని తలపించింది. ఆనాడు తెలంగాణ సాధన, నేడు భారతదేశ ఉద్దీపన! గుండెల నిండా ఉక్కు సంకల్పం ఉంటే.. ఉరికురికి రాదా విజయం నీ దరికి!!
దూరదూరాల దీపాల తోరణాల
భరతవీరుల నెత్తుటి వరద కలదు
అందులోవిచ్చె బంగారుటంబుజములు
భరతమాతృపదమ్ముల వ్రాలు కొరకు
ఈ దేశం ఎందుకిలా కునారిల్లుతున్నది?
13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాటవాలను విదేశాల్లో ఖర్చు చేస్తున్నారు. భారత పౌరులకు అమెరికాలో గ్రీన్‌కార్డు దొరికితే.. ఆ పిల్లలు ఫోన్ చేసి ‘అమ్మా నాకు గ్రీన్ కార్డు వచ్చింది’ అని చెప్తే, ఇక్కడ తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వారిని పిలిచి పార్టీలు చేసుకుంటున్నరు. ఏమిటీ దౌర్భాగ్యం? మనకు ఆస్తి లేకనా? భూమి లేకనా? నీరు లేకనా? ఖనిజాలు లేకనా? అటవీ సంపద లేకనా? మేధస్సు లేకనా? ఎందుకు ఈ దేశం ఇలా కునారిల్లుతున్నది! ఏమిటీ దౌర్భాగ్యం? దీనిపై మనందరం ఆలోచించాలి.
భారత్ లక్ష్యమేమిటో ఎవరికైనా తెలుసా?
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పశ్చిమ కనుమల నుంచి తూర్పు సరిహద్దు వరకూ దేశం నలుమూలల ఉండే ప్రజల సామూహిక లక్ష్యం, గమ్యం ఉండాలి. ఆ దిశగా దేశమంతా సామూహిక ప్రయత్నం చేయాలి. అట్ల అన్ని దేశాలు చేస్తయి. మరి భారతదేశం ఎందుకు అలా చేయడం లేదు? ఎందుకు గతి తప్పుతున్నది? ఎందుకు లక్ష్యం లేకుండా చీకట్లో బాణంలా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతా ఉన్నది? అయినా మనం మౌన ప్రేక్షకులుగానే ఉండాలా?
ఇలాంటి దేశమేనా మనకు కావల్సింది?
దేశ రాజధానిలో దేవుడి పేరిట జరిగే ఊరేగింపులో కత్తులు పట్టుకొని ఊరేగింపులా? తుపాకులతో ఊరేగింపులా? ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది? ఇందుకోసమేనా మహాత్ముడు కలలు కన్నది? ఇదేనా ప్రజలు కోరుకుంటున్న భారతదేశం? ప్రజలకు కావాల్సింది ప్రాజెక్టులల్ల నీళ్లు, కరెంటు, మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు. వాటన్నింటినీ పక్కనపెట్టి కత్తులు పట్టుకొని మతం పేరిట, కులం పేరిట పొడుచుకొని చావండి.. విద్వేషాలు పెంచుకోండి అని అనడం ఏం దౌర్భాగ్యం? ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. ఇట్లా అయితే ఎవరూ సురక్షితంగా ఉండరు. మంచి జరగదు.
తరిమివేసే శక్తి తప్పక వస్తుంది!
తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే! పెద్ద శక్తి పుట్టలే! గాలి దుమారం లేపలే! రాష్ర్టాన్ని సాధించుకు రాలే! అట్లనే దేశానికి అవసరమైననాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి, తుఫాను సృష్టించి, ఈ దుర్మార్గాన్ని తరిమివేసే శక్తి తప్పకుండా వస్తుంది. అందులో తెలంగాణ, టీఆర్ఎస్ సముజ్వలమైన పాత్ర పోషిస్తాయి.
నిలబెట్టి అడిగితే, కడిగితే ఏమైతది?
బాధాకరం ఏమిటంటే 75 వేల తలసరి ఆదాయం ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, 2 లక్షల 75 వేల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నీతి పాఠాలు చెప్తడట. దీన్ని మనం మౌనంగా, మూగగా వింటున్నం. ఇదీ పరిస్థితి. ఆలోచిస్తే బాధ కలుగుతది. అట్లెట్లా చెప్తున్నవ్ అని నిజంగా నిలబెట్టి అడిగితే ఏమైతది?
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ప్రకృతి అనుకూలతతోపాటు అన్ని వనరులు ఉన్నప్పటికీ దేశం ఆగమవుతున్నదని, మనం కూడా రాష్ట్రంగా ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం, దేశ ప్రగతికోసం ప్రజలకు ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి సైనికుడిగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. బుధవారం హెచ్ఐసీసీలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపు సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. మనసు పెట్టి, స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించిన ప్రబల ఆర్థికశక్తిగా భారతదేశం మారే అవకాశాలు సుసంపన్నంగా ఉన్నాయని చెప్పారు. అందరి అభిప్రాయాలమేరకు రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకొని, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రను నిర్దేశించుకొని ముందుకు వెళ్దామని పార్టీ ప్రతినిధులకు చెప్పారు.
జాతీయ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపం, ఈ దేశం ఎటు పోవాలి, ఉన్న వనరులేమిటి? వసతులేమిటి? తదితర అంశాలపై 15-20 రోజుల్లో దేశ విదేశాల్లో ఉండే ఆర్థికవేత్తలందరినీ ఆహ్వానించి హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామని తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కొందరు వస్తారని వెల్లడించారు. ఆలిండియా సర్వీసెస్‌లో పనిచేసి రిటైర్ అయిన వారు దాదాపు 2 వేల మంది ఉన్నారని, వారితో కూడా త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. తెలియని విషయాలను తెలిసినట్టు నటించి భంగపాటుకు గురయ్యే బదులు.. ఈ సమావేశం ద్వారా వివిధ అంశాలపై అవగాహనకు వచ్చి, సమగ్రమైన దృక్పథం, సమగ్రమైన ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఇటీవలికాలంలో తాను మాట్లాడిన మాటలను విశ్లేషించి టంకశాల చాలా చక్కటి వ్యాసం రాశారని ప్రశంసించారు.
రొటీన్ రాజకీయాలకు భిన్నంగా
ప్రస్తుతం దేశంలో రొటీన్ రాజకీయాలకు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యక్తులు ప్రధానులు కావటం.. ఒక పార్టీ అధికారం పోయి.. మరో పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం కాదని చెప్పారు. స్వాతంత్య్ర లక్ష్యాలు సఫలం కాలేదనే విషయాన్ని మన ముందున్న దేశం స్పష్టంగానే చెప్తున్నదన్నారు. ఫ్రంట్లు, టెంట్ల బాధల నుంచి బయటపడి.. కొత్త పంథాలో పురోగమించాలని చెప్పారు. ఇందుకోసం తీసుకురావాల్సిన నిర్మాణాత్మక మార్పులు విధానాలపై కసరత్తు చేయాలన్నారు. 75 ఏండ్లలో ప్రజలకు ప్రాథమిక అవసరాలైన మంచినీళ్లు, విద్యుత్తు, విద్య, వైద్యం సమకూర్చడంలో ప్రభుత్వాలు విఫలం కావడానికి వెనుక ఆలోచన విధానంలో, విధాన రూపకల్పన అమలులో లోపాలు ఉన్నాయని తెలిపారు.
అలా చేస్తే దేశం.. అమెరికాను దాటుతుంది
రాజకీయాలను మూస ధోరణిలో నడపటంతో దేశానికి ఉజ్వలమైన ప్రస్థానం, అద్భుతమైన ఆవిష్కరణలు తెచ్చే అంశాలు తెరపైకి రాలేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పక్కనున్న చైనా ఎకానమీ 16 ట్రిలియన్ల డాలర్లకు దూసుకుపోతే మనం 3 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. చైనా పాలసీ నియంతృత్వంగా ఉంటుందని.. మనదే బాగున్నదని భాష్యం చెప్తున్నారన్న కేసీఆర్.. మన పాలసీ చైనా కంటే బాగుంటే.. మనం ఎందుకు ముందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. ఏమీ లేని సింగపూర్‌కు వెళ్లే టూరిస్టులు ఎందరు? మన దేశానికి వచ్చే టూరిస్టులు ఎందరని నిలదీశారు. పర్యాటకం, సర్వీసుల రంగాలు అద్భుతంగా పురోగమిస్తుంటే.. ఆ అవకాశాలను ఎందుకు వినియోగించుకోవడం లేదని అడిగారు. దేశంలో ఉన్న సహజమైన జలపాతాలు, అటవీ సంపద, వన్యమృగ సంపద, శిల్పకళా వైభవం, ఆర్ట్స్, పెయింటింగ్స్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీన్నంతా విడిచిపెట్టి సింగపూర్‌లో సింహం బొమ్మ దగ్గర ఫొటోలు దిగడం మన దౌర్భాగ్యమని అన్నారు. ప్రపంచమంతా మన దగ్గరకు రావాల్సింది పోయి.. మనం ఎక్కడెక్కడికో పోతున్నామని బాధను వ్యక్తంచేశారు.
గద్దెనెక్కాల్సింది ప్రజలు.. పార్టీలు కాదు
దేశానికి ఇప్పుడు కావాల్సింది ఒక పార్టీ గద్దె దిగటం.. ఒక పార్టీ గద్దెనెక్కడం కాదని.. ప్రజలు గద్దెనెక్కాలని.. వారి జీవితాలు మారాలని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. క్రమశిక్షణతో, నియంత్రిత విధానంతో పురోగమించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా మారితే.. అది మన రాష్ర్టానికి గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా చేయాలన్న డిమాండ్ వస్తున్నదని పేర్కొన్నారు. కొందరు తమ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న మతపిచ్చి కుట్రలకు బలికాకుండా సోదరభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా?
క్రైస్తవ దేశమైన అమెరికా ప్రధాన నగరాల్లో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. స్థిరచిత్తంతో కృషిచేస్తే భారత్.. అమెరికా కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. గతంలో గల్ఫ్ దేశాల్లో చాలా పేదరికం ఉండేదని, కానీ వాళ్ల ప్రణాళికతో నేడు ధనిక దేశమైందని తెలిపారు. అధికారిక ఇస్లామిక్ దేశం అయినా, టూరిస్టులను ఆకర్షించేందుకు ఎన్నో హిందూ దేవాలయాలు నిర్మించారని చెప్పారు. దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి, ఆకలి నివారణ గురించి ఆలోచనలు జరగాలని చెప్పారు. ఆకాశమెత్తు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఆర్టీసీ బతకాలా? చావాలా? అని ప్రశ్నించారు. దాదాపు 2, 3 వేల కోట్లు ఇచ్చి ఆర్టీసీని బతికించుకొంటున్నామని గుర్తు చేశారు. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని మోదీ చెప్తున్నారని, అలా చేస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని తెలిపారు. ఏ రాష్ట్రమైతే ప్రైవేటైజేషన్ చేస్తదో, అమ్ముతదో ఆ రాష్ర్టానికి ప్రైజ్ మనీ పెట్టిన ఘనుడు ప్రధాని మోదీ అని విమర్శించారు. ధరలు పెంచితే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచామని, ఏడెనిమిదేండ్లలో ఎన్నడూ పెంచలేదని, ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పామని తెలిపారు.
బీజేపీ కుటిల నీతిని ప్రజలకు వివరించండి
తరతరాల సంస్కృతి, సంప్రదాయం ఉన్న అతి గొప్ప వైవిధ్యమైన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని కేసీఆర్ ఆరోపించారు. ‘దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పోయే పరిస్థితుల్లో.. భయంకర విషాన్ని, మనిషిని చూస్తేనే ద్వేషించే అనాగరిక, అనాలోచిత విధానాన్ని దేశంలో చొప్పిస్తున్నారు. ఇదంతా ఏమి ఆశించి? దానికి చెప్పే కారణమేంది? హిందూత్వం ప్రమాదంలో ఉన్నదని. అరె.. దేశ ప్రధానమంత్రి హిందు, దేశ రాష్ట్రపతి హిందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిందు, ఏ ఒక్కరో ఇద్దరో మినహాయిస్తే ముఖ్యమంత్రులందరూ హిందువులే.. ఇప్పుడు హిందూత్వానికి ప్రమాదమెట్ల వచ్చింది? జుగుప్సాకరమైన విద్వేషం రగిలించి, దాన్నుంచి రాజకీయ ప్రయోజనం పొందే కుట్ర ఇది’ అని మండి పడ్డారు. దీన్ని అలవోకగా తీసుకోవద్దని, బీజేపీ కుటిల నీతిపై ఎక్కడికక్కడ చర్చలు పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శిక్షణ శిబిరాల్లో కేంద్రం కుటిల నీతి, దేశం ముందుకెళ్లాల్సిన విధానాలు తదితర అంశాలపై స్పష్టమైన సిలబస్ రూపకల్పన చేశామని, ఇవన్నీ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి కేంద్ర విధానాలను ఎండగట్టాలని సూచించారు.
క్లిష్ట పరిస్థితుల్లో దేశం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో విషం చిమ్ముతున్నారని, ఇదే జరిగితే దేశం మరో వందేండ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు, గృహనిర్మాణం, దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దేశం అన్నింటిలో అట్టడుగుకు చేరుతున్నదని తెలిపారు. జీడీపీ, ఎకానమి పడిపోయాయని, రేట్లు ఆకాశానికి అంటుతున్నాయని వెల్లడించారు. దేశంలో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తు భయంకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశం కోసం పోరాటం
తెలంగాణ ఏర్పడితే.. దేశంలోనే ధనిక రాష్ట్రం అవుతుందని ఆనాడే చెప్పానని, నేడు అదే నిజమైందని కేసీఆర్ అన్నారు. దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకొనే ఉద్యోగులున్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని ఉద్యమ సమయంలోనే ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పానని గుర్తుచేశారు. సర్వజన సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ విజయాల పరంపర ఇలానే కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే మనలో మనమే పరిష్కరించుకొందామని అన్నారు. విదేశీ యాత్రలు చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని రెట్టింపు చేసుకొందామని, శిక్షణ శిబిరాలు నిర్వహించుకొందామని అన్నారు. ఆ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్లీనరీలో తన ప్రసంగాన్ని విన్న హైదరాబాద్ రచయిత్రి జయప్రభ దేశానికి ఏం కావాలో కేసీఆర్‌కు బాగా తెలుసని ఒక సందేశం పంపారంటూ, ఆమెకు ప్లీనరీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కటాక్షంతో దేశ భవిష్యత్తు కోసం పోరాడుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
90కి పైగా స్థానాల్లో గెలుపు మనదే
రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, ఇందులో ఎవ్వరికీ సందేహం అవసరంలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్ని సాంకేతికపరమైన విషయాలను అవగాహన చేసుకునేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించుకొన్నట్లు, వారి సర్వేలో సైతం టీఆర్ఎస్ 90 పైచిలుకు స్థానాలు అలవోకగా గెలుస్తున్నట్లు తేలిందన్నారు. మరింత విజ్ఞానాన్ని సముపార్జించుకునేందుకు పార్టీ నాయకులు, క్యాడర్‌కు శిక్షణ శిబిరాలు త్వరలోనే ఏర్పాటుచేయాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌తోపాటు ప్రధాన కార్యదర్శులు దీనికి చర్యలు తీసుకోవాలని కోరారు.
వెయ్యి కోట్ల టీఆర్ఎస్
పార్టీకి అద్భుతమైన నిధులు సమకూరినట్లు, హైదరాబాద్‌లో సమున్నతంగా తెలంగాణ భవనం ఉద్యమ సమయంలోనే నిర్మించుకొన్నట్టు చెప్పారు. దేశ రాజధానిలో కూడా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆరేడు నెలల్లో అక్కడ కూడా భవనం సిద్ధమవుతుందన్నారు. 33జిల్లాలో ఇప్పటికే 31జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం జరిగిందని, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు సూచించారు. నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించాలని కోరుతున్నారని తెలిపారు. పార్టీకి ఉన్న నిధులను జ్ఞానసముపార్జనకు వినియోగించాలని, జిల్లాస్థాయి నుంచి పార్టీ నేతలు ఇజ్రాయిల్, చైనా వంటి అభ్యుదయ దేశాల్లో పర్యటించాలని సూచించారు. జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నామంటే మా దీవెన ఉన్నదంటూ చాలామంది దాతలు ముందుకొచ్చి విరాళాలు సమకూర్చారని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాలు మినహా రూ.451కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటితోపాటు బాండ్లు, దేశ చట్టాలు, నిబంధనలకు లోబడి టీఆర్ఎస్కు నేడు రూ.861కోట్ల నిధులు ఉన్నాయన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టామని, వాటిపై ప్రతినెలా రూ.3.84 కోట్లు వడ్డీ వస్తున్నదని చెప్పారు. వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము మరో కరెంట్ ఖాతాలో జమవుతున్నట్టు తెలిపారు. అందులో రూ.24.75 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అన్నీ వెరసి రూ.865 కోట్ల నగదు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నదని చెప్పారు. ఢిల్లీ కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం అన్నీ కలుపుకొని పార్టీకి రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కేసీఆర్ వివరించారు.