హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్యాలెట్ పేపరులో లేకుండా చేయకపోవడం చట్ట వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేయాలని ఆయన తరపు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి కోరడంతో మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
ఇందులో ప్రతివాదులుగా ఈసీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, చండూరు రిటర్నింగ్ అధికారులను చేర్చారు. ఇప్పటికే కారు గుర్తు ను పోలిన గుర్తులు తొలగించాలని ఈసీని కోరామని, ఈసీ నుంచి స్పందన లేకపోవడం తో హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని టీఆర్ఎస్ రిట్లో పేరొన్నది. టీఆర్ఎస్ ఎన్నిక ల గుర్తు కారును పోలినట్టుగా ఉండే కెమెరా, చపాతీ రోలర్, డోలి (పల్లకి), రోడ్ రోలర్, సబ్బుపెట్టె, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఓటర్లను గందరగోళానికి గురి చేస్తాయని వివరించింది. రోడ్డు రోలర్, కెమెరా, టెలివిజన్ గుర్తులకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు నమోదైన విషయాన్ని గణాంకాలతో వివరించింది. ఈ గుర్తుల విషయంలో తమ అభ్యంతరాలపై ఈసీ స్పందించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 2018 ఎన్నికల్లో పలువురు ఓటర్లు కారు గుర్తుగా భావించి రోడ్‌రోలర్ గుర్తుకు ఓట్లు వేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో కారు గుర్తును పోలి ఉన్న రోడ్‌రోలర్ సహా 8 గుర్తుల తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.