హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి కేంద్రం వారం రోజుల్లో బియ్యం కొనకపోతే బీజేపీ అంతుచూస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతల ఇండ్లు, కార్యాలయాలను ముట్టడించి, వారిని గ్రామాల నుంచి తరిమి కొడతామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ బిడ్డలే అయితే ఇకనైనా రాష్ట్ర రైతాంగానికి అండగా ఉండాలని హితవు చెప్పారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీని ఒప్పించి వడ్లు కొనుగోలు చేయిస్తామని, వరి వేయాలని రైతులను పక్కదారి పట్టించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడకుపోయారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకొన్న బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
రైతులపై ఇంత దుర్మార్గమా?
ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోదీ, పీయూష్‌గోయల్ మొదటి నుంచి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మొన్నటిదాకా వడ్లు కొనేది లేదన్న గోయల్ ఇటీవల నిర్వహించిన వ్యవసాయ సదస్సులో వరివేయాలని, బియ్యం ఎగుమతికి సహకరించాలని కోరారని గుర్తుచేశారు. దేశ సంపదను అదానీకి కట్టబెట్టడమే విధానంగా పెట్టుకొన్న మోదీ దేశాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోయినా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు పెట్టి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3003 రైస్ మిల్లుల్లో ప్రస్తుతం 94 లక్షల టన్నుల ధాన్యం ఉన్నదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల వల్ల రాష్ట్రంలో 15 రోజులుగా ఒక్క రైస్ మిల్లు కూడా నడవడం లేదని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, మిల్లర్ల వ్యవస్థను కుప్పకూల్చాలని మోదీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. రైతులు, మిల్లర్ల ఉసురు మోదీకి తప్పక తగులుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.35 వేల కోట్ల విలువైన బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. మిల్లుల తనిఖీలు చేసిన ఎఫ్‌సీఐ కేవలం రూ.15 కోట్లకు లెక్కదొరకటం లేదని కుంటిసాకులు చెప్తున్నదని మండిపడ్డారు. లెక్కప్రకారం బియ్యం ఇవ్వని మిల్లులపై చర్య తీసుకోవచ్చునని, దానికి మిల్లర్లే బాధ్యత వహిస్తారన్న విషయం కేంద్రానికి తెలియదా? అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా మోదీపై రైతులు తిరగబడుతున్నారని, కేంద్రం పీఠం కదులుతున్నదని చెప్పారు. దానిని ఎవరూ ఆపలేరని, మోదీని దించుడు ఖాయమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సర్వేలు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సేనని తేల్చిచెప్పాయని పేర్కొన్నారు. ఈటల బుట్టాచోర్ మాటలు బంద్ చేయాలని హెచ్చరించారు. గజ్వేల్‌లో పోటీచేస్తానంటూ రాజేందర్ తనస్థాయికి మించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.58 వేల కోట్లను రైతుబంధు కింద చెల్లించడం రైతులపై ప్రేమకు నిదర్శనమని చెప్పారు.
కాళేశ్వరంపై సన్నాసుల మాటలు పట్టించుకోం
చరిత్రలో ఎన్నడూలేనివిధంగా భారీ వర్షాలు పడ్డాయని, 30 లక్షల క్యూసెకుల రికార్డు వరద కాళేశ్వరానికి పోటెత్తిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. క్యూసెక్కులు, టీఎంసీలు అంటే ఏమిటో తెలియని సన్నాసుల మాటలను తాము పట్టించుకోబోమని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం వద్ద పంపులు మునగడం సహజమేనని, వరద తీవ్రత తగ్గాక వాటిని బాగుచేస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అజ్ఞానులు మాట్లాడితే తామేం చేయలేమని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే జాజుల సురేందర్ పాల్గొన్నారు.