హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ అబద్ధాల యూనివర్సిటీకి వైస్‌చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బండి సంజయ్ తొండి సంజయ్గా మారారని అన్నారు. తమ వంద ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తెలంగాణ ప్రజలు బీజేపీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అర్వింద్‌లు డీ గ్యాంగ్ (దోపిడీ దొంగలు, డెకాయిట్లు, డ్రగ్స్ గ్యాంగ్)గా మారారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం కోరుతూ సమాచార హకు చట్టం కింద తానే దరఖాస్తు చేస్తున్నానని వెల్లడించారు. బీజేపీకి మహిళలపై ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 16 కోట్ల ఉద్యోగాలు ఏవి? అని నిలదీశారు. ‘స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తెచ్చారా? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేశారా? రైతులకు చేసిన మేలు ఏమిటి? కాళేశ్వరం లాంటిది ఒక ప్రాజెక్టు కట్టారా? ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీళ్లు ఇచ్చారా? బీజేపీ పాలనలోని ఏ రాష్ట్రంలోనైనా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారా? రైతు బంధు, దళితబంధు పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ధరించే వస్ర్తాల ఖర్చెంత? ఆయన విదేశీ ప్రయాణాల వ్యయమెంత?’ అని నిలదీశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు సమాచార హకు చట్టం కింద దరఖాస్తు చేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని మోదీ ఆపారంటూ బండి సంజయ్ చేసిన ప్రకటన హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ హక్కులను పరిరక్షించలేని దద్దమ్మలు బీజేపీ ఎంపీలని మండిపడ్డారు.
గ్యాస్ ధరలకు సమాధానమేదీ?
కేంద్ర మంత్రి సృ్మతి ఇరానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గొంతు చించుకున్నారని, ఆమె రాహుల్‌గాంధీకి చీరెలు, గాజులు పంపారని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. కేంద్రం గ్యాస్ ధర పెంచి మహిళల జీవితాలను గుదిబండగా మార్చిందని మండిపడ్డారు. గ్యాస్ ధరను రూ.1105కు చేర్చిన పాపానికి బీజేపీ.. మహిళల ఆగ్రహంలో మాడి మసైపోతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయ అభివృద్ధికి బీజేపీ చేసిన సహాయం ఎంత అని ఆయన ప్రశ్నించారు.
వసూళ్ల బండి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బండి సంజయ్ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని, త్వరలోనే ఆ జాబితా విడుదల చేస్తామని జీవన్‌రెడ్డి చెప్పారు. అబద్ధాల బీజేపీ గ్యాంగ్‌ను తరిమి కొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నిజామాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగితే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైల్ ఇంజిన్లు అమ్ముకునే బీజేపీ డబుల్ ఇంజిన్ తమకొద్దు అని దేశ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. దేశానికి కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.