హైదరాబాద్ : తెలంగాణలో కొత్త సంవత్సరంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కసరత్తు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇక బీజేపీ భరతం పట్టేందుకు యువత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు.. ఇవాళ ఉద్యోగాల పేరు మీదు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది.. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని బండి సంజయ్‌ను ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఒక ఉద్యోగాలు ఇస్తే.. తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరహాలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బహిరంగ లేఖ విడుదల చేసే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? అని అడిగారు. బండి సంజయ్‌కు చీము, నెత్తురు ఉంటే లేఖ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
బీజేపీ భరతం పట్టేందుకు రాష్ట్ర యువత సిద్ధం కావాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆరాచకాల పట్ల యువత మౌనం పాటించొద్దు. ఏ వేదిక దొరికితే ఆ వేదికపై బీజేపీ నిలదీయాలి. దొంగలే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకోని రాష్ట్ర యువత- ప్రజలు బీజేపీ నేతలను నిలదీయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.