Telangana | హైదరాబాద్, ఆగస్టు1(నమస్తే తెలంగాణ): గీతన్నలపై కత్తిగట్టిన కాంగ్రెస్ సర్కారు.. కల్లు నిషేధానికి కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కల్తీ కల్లు ఘటనల వెనుక లిక్కర్ మాఫియా హస్తం ఉన్నదని ఆరోపించారు. అక్రమ దందాకు కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తున్నదని ధ్వజమెత్తారు. ఖజనా నింపుకొనేందుకు ఊరూరా, గల్లీగల్లీనా మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని దుయ్యబట్టారు. గడువు ముగియకముందే నూతన ఎైక్సెజ్ పాలసీని తేవడంలోని ఆంతర్యం ఇదేనని అనుమానం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బెల్ట్‌షాపులను ఎత్తేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందనిమండిపడ్డారు.
మద్యంపై రాబడిని పెంచుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నదని మండిపడ్డారు. పాత ఎైక్సెజ్ పాలసీ గడువు ముగియకముందే కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నదని తెలిపారు. దరఖాస్తు ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు, పాలసీ గడువును మూడేండ్లకు పెంచేందుకు సిద్ధమవుతున్నదని చెప్పారు. కల్తీ నెపంతో 1.50 లక్షల మంది గీత కార్మిక కుటుంబాలతోపాటు వృత్తిపై ఆధారపడే ముదిరాజ్‌లు, కుమ్మర, కటిక తదితర బీసీ బిడ్డల ఉపాధిని దెబ్బతీయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. సిగాచి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై ఊదాసీనంగా ఉన్న సర్కారు.. రెండు షాపుల్లో కల్తీ కల్లు ఘటనలు జరిగితే ఆగమేఘాలపై కేసులు నమోదు చేయడం, కల్తీ నిర్ధారణ కాకుండానే దుకాణాల నిర్వాహకులను జైళ్లకు పంపడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఒక్క దుకాణం తరలించినా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
గీత వృత్తిపై కాంగ్రెస్ కత్తి: స్వామిగౌడ్
గీతవృత్తిపై కాంగ్రెస్ సర్కారు కత్తిగడుతున్నదని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. కల్తీ కల్లు ఘటనల్లో దోషులెవరో తేలకముందే కల్లు దుకాణాదారులను వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనలను సాకుగా చూపి వృత్తిపై ఆధారపడిన 1.5 లక్షల కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తున్నదని విరుచుకుపడ్డారు. కల్తీ కల్లు నిర్ధారణలోనూ కుట్రలు జగుతున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. మద్యం అమ్మకాలను విరివిగా పెంచి కులవృత్తులను విధ్వంసం చేస్తే ఊరుకోమన్నారు.