హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ విధానాలు కోపరెటివ్ ఫెడరలిజం స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని వినోద్ కుమార్ మండిపడ్డారు. భారతదేశం అంటే ఒక్క గుజరాత్ రాష్ట్రమే అన్న విధంగా ప్రధాని వ్యహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదని పేర్కొన్నారు. ఇదే నా.. మీ కోపరేటివ్ ఫెడరలిజం నీతి..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. కేవలం ఒక్క గుజరాత్ రాష్ట్రానికే వేలాది కోట్ల రూపాయలు తరలించడం ఎంత వరకు సమంజసం అని వినోద్ కుమార్ ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. వచ్చే డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించడం ఎంత వరకు సబబు అని వినోద్ కుమార్ అడిగారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయం గురించి ప్రధాని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలను పూర్తిగా విస్మరిస్తోందని, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని వినోద్ కుమార్ దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ.. నరేంద్ర మోదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో స్వశక్తితో ముందుకు దూసుకెళ్తుందని వినోద్ కుమార్ తెలిపారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా.. ఇతరత్రా సహకారం అందించకున్నా.. స్వశక్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకెళ్తున్నదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.