హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రారంభించి, ఉత్పత్తి చేస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి మోదీ రావడం వెనుక లోతైన కుట్ర ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. మోదీ రామగుండం పర్యటనను నిరసిస్తూ శుక్రవారం గోదావరిఖనిలో జరిగిన ధర్నాలో కూనంనేని పాల్గొని, ప్రసంగించారు. రామగుండం ఎరువుల కర్మాగారం సింగరేణి బొగ్గు ఆధారంగానే నడుస్తున్నదని, తెలంగాణ గుండెచప్పుడు అయిన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా తన కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీలకు కట్టబెట్టరని నమ్మకమేంటని ప్రశ్నించారు. ప్రధానిగా మోదీ చేసిన తప్పులకు నిరసన తెలియజేసే నైతిక హకు తమకు ఉన్నదని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ సైతం నిరసన తెలియజేశారని గుర్తుచేశారు. రైతుల ఆగ్రహంతో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. మళ్లీ ఆ చట్టాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రాల మీద మోదీ షరతులు విధిస్తున్నారని.. అంబానీ, అదానీ డిసంలకు విద్యుత్తు కొనుగోలు అవకాశాలు కల్పిస్తేనే రాయితీలు ఇస్తామనే రీతిలో షరతులు పెట్టడం సమంజసం కాదన్నారు. మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రధాని పర్యటనకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూనంనేని స్పష్టం చేశారు.
బీజేపీ ధృతరాష్ర్టుడిలాంటి పార్టీ అని.. దానితో స్నేహం చేసిన పార్టీల పరిస్థితి అధోగతేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. స్నేహ హస్తం ఇచ్చిన పార్టీలను బీజేపీ మిత్రద్రోహం చేస్తూ మింగేస్తుందని ఆరోపించారు. అధికారం కోసం శివసేనను చీల్చడం, అకాలీదళ్‌ను దూరం చేసుకోవడం వంటివి దీనికి నిదర్శనాలని చెప్పారు.