Tirumala | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించినా.. కొందరి అధికారుల తీరుతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు. దర్శనం కోసం సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన వారిని టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆవేదనవ్యక్తం చేసిన ఓ వీడియో మంగళవారం వైరల్గా మారింది. తిరుమలలో వీఐపీ దర్శనానికి సిఫార్సు లేఖలు తీసుకొస్తే.. అధికారులు తమను దగ్గరికి కూడా రానివ్వడం లేదని తెలిపారు. ఏపీ భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. సోమ, మంగళవారం దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సిఫార్సు లేఖలు అంగీకరించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఇదేంటని అడిగితే దర్శనం లేదు.. వెళ్లిపోండి అంటున్నారని భక్తులు వివరించారు. కాగా, గతనెల 24నుంచి సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ వెల్లడించిన విషయం తెలిసిందే.