పెద్దవంగర, జూన్ 14 : పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్యాతండా, శంకర్తండా, బొత్తల తండాల్లో నిర్వహించిన పల్లెబాటలో పాల్గొన్నారు.
ఆయా తండాల ప్రజలు తమ సమస్యలను వినిపించే ప్రయత్నం చేయగా, ఆమె అర్ధంతరంగా పర్యటనను ముగించుకొని వెళ్లిపోయారు. పల్లెబాటలో భాగంగా మోత్యతండా గిరిజనులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీశారు. తాగునీటి కొరత, విద్యుత్తు సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై నిలదీయగా స్పందించకుండా వెళ్లడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోతే నాయకుల అవసరం ఏమిటి?’ అంటూ అసహనం వ్యక్తంచేశారు.
బొత్తల తండాలో నిర్వహించిన పల్లెబాటలో ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. జై కాంగ్రెస్.. జై కాంగ్రెస్ అంటూనే ఒక్కసారిగా జై దయాకర్రావు అని నినదించాడు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, గిరిజనులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.