భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ కోసగుంపులో పోడు భూముల్లో విత్తనాలు విత్తుతున్న ఆదివాసీ మహిళలపై ఈ నెల 20న అటవీ శాఖ అధికారులు చేసిన దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. తమను బూటుకాళ్లతో తన్నారని, నైటీలు చించివేసి అసభ్యకరంగా ప్రవర్తించారని, వారి ప్యాంటు జిప్పులు తీసి చూపించారని, బాలింతలమని చెప్పినా, ఆపరేషన్ చేయించుకున్నామని ప్రాధేయపడినా వదల్లేదని, కనీసం కనికరం కూడా చూపలేదని ఆదివాసీ ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడుభూమిలో పత్తి విత్తనాలు పెడుతున్న తమ వద్దకు జేసీబీలతో ఎందుకొచ్చారంటూ అడిగినందుకు అధికారులు దాడులకు పాల్పడ్డారని, పిడిగుద్దులు గుద్దారని చెప్పారు.
వాటికి తాళలేక తాము రెండు చేతులు జోడించినా, కాళ్లు మొక్కుతామంటూ ప్రాధేయపడినా వదలలేదని కంటతడి పెట్టుకున్నారు. పైగా ‘జేసీబీతో వీళ్లను తొక్కేయ్’ అంటూ జేసీబీ ఆపరేటర్ని అటవీ శాఖ అధికారులు ఆదేశించారని ఆరోపించారు. తాము తప్పించుకొని బయటకు వచ్చామని, లేదంటే అక్కడే తమను చంపేసేవాళ్లని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 20న కోసగుంపులో ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారులు చేసిన అమానుష దాడుల విషయంలో వాస్తవాలను తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ బృందం సోమవారం ఆ గుంపునకు (కోసగుంపు) వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా గ్రామ కూడలి వద్దకు కదిలి వచ్చారు. ఈ నెల 20న జరిగిన దాడి విషయాలను కండ్లకు కట్టినట్టు వివరించారు.
‘కోసగుంపునకు చెందిన ఆదివాసీ మహిళలందరం కలిసి చంటిబిడ్డలను తీసుకొని సాగుచేసుకుంటున్న పోడుభూముల వద్దకు వెళ్లాం. మా భర్తలు వేరే పనులకు వెళ్లడంతో మేం వెళ్లి మా పోడు భూముల్లో పత్తి విత్తనాలు పెడుతున్నాం. ఆ రోజు ఉదయం అటవీ శాఖ అధికారులు జేసీబీ యంత్రాలతో అక్కడకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ అక్కడే ఉన్నారు. ఆ తరువాత మా వద్దకు వచ్చి విత్తనాలు వేయొద్దని అడ్డుకున్నారు. ‘ఇది మేం ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడుభూమి, కొత్తగా ఏమీ పోడు చేయలేదు. అయినా ఎందుకు ఇక్కడికి వచ్చి మమ్ములను అడ్డుకుంటున్నారు?’ అని అడిగాం. అధికారులు రెచ్చిపోయారు. విత్తనాలు పెట్టిన పోడు భూములను జేసీబీతో పెకిలించబోయారు. మేం జేసీబీకి అడ్డుగా వెళ్లాం. మాపై దాడులకు పాల్పడ్డారు. పైశాచికంగా ప్రవర్తించారు.
మా నైటీలు చించివేశారు. మాలో ఆరుగురం బాలింతలం ఉన్నాం. ‘మా చంకల్లో పిల్లలున్నారు. ఆపరేషన్ చేయించుకొని ఉన్నాం. మమ్మల్ని వదిలేయండి. మీ కాళ్లు మొక్కుతాం’ అంటూ రెండు చేతులూ జోడించి ప్రాధేయపడ్డాం. అయినా వదల్లేదు. దీంతో మరికొందరు ఆదివాసీ మహిళలు వచ్చి జేసీబీకి అడ్డుగా వెళ్లారు. దీంతో ‘ఎందుకొచ్చేరే..’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ అటవీ సిబ్బంది మాపై విరుచుకుపడ్డారు. బూటుకాళ్లతో తొక్కారు. చితకబాదారు. ఓ మహిళ చంకలో ఉన్న చంటిబాబు కాలికి గాయం కూడా అయింది’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఆదివాసీ మహిళలమైన మాపై అటవీ శాఖ అధికారులు దాడిచేసినా ఉన్నతాధికారులు బాధ్యులపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. మా భర్తలు మాతో పోడు భూమిలో లేని సమయంలో అధికారులు వచ్చి దాడులకు పాల్పడ్డారు. అది వీడియో తీస్తున్న అంగన్వాడీ టీచర్‌ను కూడా బెదిరించారు. ఆమె ఫోన్ లాక్కున్నారు. ‘ఫోన్లో వీడియా తీస్తవా? నీ అంతుచూస్తాం’ అంటూ ఆమెను బెదిరించారు. ఈ నెల 20కి మూడు రోజులు ముందు మా గ్రామానికి సిబ్బంది వచ్చారు. ‘ఇంటికి రూ.రెండు వేల చొప్పున ఇవ్వండి. మీ గ్రామానికి మేము రాము.’ అని చెప్పారు. మొత్తం 30 కుటుంబాల వాళ్లం కలిపి రూ.60 వేలు జమ చేసి ఇచ్చాం. అదేరోజు వారు బీరు బాటిళ్లు తెచ్చుకొని నాటుకోడి కూరతో పార్టీ చేసుకున్నారు. మూడు రోజుల తరువాత మళ్లీ మాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చంటి పిల్లాడిని చంకలో ఎత్తుకొని పోడు భూమికి వెళ్లాం. అప్పు డే మా దగ్గరకు అటవీ అధికారు లు వచ్చారు. జేసీబీలతో ఎందుకొచ్చారని అడిగాం. అంతలోనే ఒక అధికారి బూటుకాళ్లతో తన్నాడు. చంకలో ఉన్న బాబును పక్కకుతోసేసి నన్ను తన్నాడు.
-మడకం నందిని, దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళ, కోసగుంపు
నా రెండు చేతులు వెనుకకు విరిచి మరీ నన్ను కొట్టారు. నా చేతిలో కూడా పిల్లోడు ఉన్నాడు. వాడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నారు. వాడిని కూడా పక్కకు తోసేశారు. పిలగాడు ఉరుకుతుంటే వాడికి దెబ్బ తగిలింది. కాలి గోరు ఊడిపోయింది. ఒళ్లంతా నొప్పులు. దవాఖానకు వెళ్లాం.
-కుంజా జోగమ్మ, దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళ
ఆదివాసీ మహిళలందరమూ అక్కడ ఉండగా ఒక అధికారి తన ప్యాంటు జిప్పు తీసి మాకు చూపించాడు. మేము ఏమీ మాట్లాడకుండా పోడు భూమి వద్ద ఉన్నప్పటికీ మమ్ములను బాగా కొట్టారు. నాకు కొద్దిరోజుల క్రితమే కాన్పు అయిందని, ఆపరేషన్ అయిందని చెప్పినా వినలేదు.
– తాటి లక్ష్మి, దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళ
మా భూమిలోకి రావద్దంటూ జేసీబీని పట్టుకున్నా. ఒక సారు వచ్చి ‘జేసీబీతో తోక్కేయరా’ అం టూ డ్రైవర్‌కు చెప్పాడు. డ్రైవర్ వద్దన్నా వినకుండా..‘తొక్కించరా?’ అంటూ అరిచాడు. దీంతో డ్రైవర్ జేసీబీని ముందుకు కదిలించాడు. నేను తప్పించుకొని బయటపడ్డాను. లేకపోతే నన్ను చంపెటోళ్లు.
– వెట్టి భీమమ్మ, దాడిలో గాయపడిన మహిళ