హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కోరారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన సలహా మండలి 7వ సమావేశం సోమవారం జరిగింది. టీఏసీ చైర్మన్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ట్రైకార్, జేసీసీ చైర్మన్లు పాల్గొని 16 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లపై గిరిజన ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించిందని, ఎమ్మెల్యే కోటాలో 500 ఇండ్లను మంజూరు చేసిందని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లకు అధిక డిమాండ్ ఉన్నదని, ఈ నేపథ్యంలో ఇండ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎస్టీలకు కనీస స్థల అర్హతను సడలించాలని, ప్రత్యేకించి ఆదిమవాసుల (పీవీటీజీ)కు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని, సమీప వాగుల నుంచి ఇసుక తరలింపును అడ్డుకుంటూ గిరిజనులపై కేసులను బనాయిస్తున్నారని వాపోయారు.
ప్రభుత్వమే గిరిజన మండల కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంతో ఇసుక డిపోలను ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించుకునే గిరిజనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పీఎం జనమ్ స్కీమ్ కింద ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంతృప్త విధానం (సాచ్యురేషన్ మోడ్)లో మంజూరు చేసే నిధులను వినియోగించుకోవాలని గిరిజన ప్రతినిధులకు సూచించారు.
ఇసుక సరఫరా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇతర అంశాలపై చర్చించి టీఏసీలో తీర్మానాలు చేశారు. వాటిని త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్, ఎంపీలు గొడం నగేశ్, బలరాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ శరత్, అదనపు సంచాలకుడు వీ సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సాంసృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు డాక్టర్ సముజ్వల, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి, టీఏసీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సభ్యులు ఇంకా ఏవైనా కొత్త అంశాలను ప్రతిపాదిస్తే వాటిని కూడా తదుపరి సమావేశ అజెండాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. తాజాగా టీఏసీలో చర్చించిన అంశాల్లో కొన్నింటిని పరిషరించుకునేందుకు త్వరలో ప్రధాన మంత్రిని కలుస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లిస్తామని, రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.
గిరిజన సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని, ఇతర అవసరాలకు మళ్లించొద్దని తెలిపారు. ఎస్టీల్లో చాలమందికి ఇండ్లు లేవని, ఈ నేపథ్యంలో వారి ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంతోపాటు పీవీటీజీల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వారికి సడలింపులు ఇవ్వాలని, పీవీటీజీలకు రూ.లక్ష అడ్వాన్స్ అందించాలని, జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానంతరం ఆమె ఇదే విషయమై మంత్రి అడ్లూరికి ప్రత్యేకంగా వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ రోడ్డును తక్షణం పునర్నిర్మించాలని కోరారు.
ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లను జారీ చేయడంలో అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 1978 ఓటర్ల జాబితా ప్రకారమే ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. షెడ్యూల్డ్ తెగలు, ఏజెన్సీ ఏరియాల గుర్తింపు 1977లో జరిగిందని చెప్త్తూ.. 1950 నుంచి ఏ జెన్సీ ఏరియాలో ఉన్నట్టు ఆధారాలను చూపాలని కలెక్టర్లు షరతు పెడితే గిరిజనులు, ఆదివాసీలు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.