వరంగల్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తాడ్వాయి: మేడారంలో ఆదివాసీ సం ప్రదాయాలకు విరుద్ధంగా గద్దెల మార్పిడి జరుగుతుందని ఆదివాసీ సంఘాలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆదివాసీ పెద్దలు, సంఘాలు, తలపతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభు త్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నాయి. సమ్మక్క వంశంలో పుట్టిన మంత్రి సీతక్క కూడా తమ సంస్కృతిని గౌరవించకపోతే ఇక తామెవరికి చెప్పుకోవాలని తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్, కొప్పుల రవి ఆవేదన వ్యక్తంచేశారు. మాస్టర్‌ప్లాన్ పేరుతో సర్కార్ చేస్తున్న హడావుడి బంగారు కత్తితో మెడ కోసిన ట్టు ఉన్నదని పేర్కొంటున్నారు. సమ్మక, సారల మ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కేవలం పూజారుల దేవతలు కాదని, ఆదివాసీ దేవతల ప్రతిరూపాలన్నది గుర్తించుకోవాలని సూచించారు. చరిత్ర తెలియకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాము గద్దెల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అలాగని ఇష్టారీతిగా సంస్కృతి, ఆచారాలను మంటగలిపితే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. మేడారంలో సర్కార్ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆదివాసీ తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఒకే వరుసలో రూపొందించడమే కాకుండా గద్దెల కైవారం సాంచీ స్థూపాన్ని పోలి ఉన్నదని ఆరోపించారు. సమ్మక దేవర కేవలం వడ్డెల (పూజారుల)తోపాటు అఖండ భారతదేశంలోని 101 కోయ రాజ్యాల్లోని 750 ఇంటి పేర్లకు దేవరగా నాటి కోయ రాజులు కొలిచారని పేర్కొన్నారు. అలాంటి ఇలవేల్పులకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. తల్లుల గద్దెల మార్పిడి నిర్ణయాన్ని మార్చుకోకపోతే సర్కారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కోయల సంప్రదాయం బయటి ఆరిటెక్చర్లకు ఏం తెలుసని ప్రశ్నించారు. బయట ఆరిటెక్చర్ల డిజైన్లు మేడారానికి అవసరంలేదని తెగేసి చెప్పారు. గద్దెల ఏర్పాటు దికులకు ప్రత్యేక వాస్తు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్నదని అన్నారు.
50 కోట్లు రాగానే ఏపకక్ష నిర్ణయాలా?
ప్రభుత్వం ప్రస్తుతం రూపొందించిన డిజైన్ లో గద్దెల కైవారం నలుదిక్కులా ద్వారాలకు సాంచీస్తూపం ఆనవాళ్లు, హిందూమత ఆనవాళ్లు ఉన్నాయని తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ సహా ఆదివాసీ ప్రతినిధులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అదే గను క జరిగితే మేడారం జాతర నిర్వహణ, పవిత్రత నుంచి తమను పూర్తిగా దూరంపెడుతున్నట్టు అనుమానించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. సమ్మక, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నూతన నిర్మాణానికి వ్యతిరేకం కాదని, వాటి నమూనా, అమరిక విధానానికి మాత్రమే వ్యతిరేకమని అన్నారు. ప్రభుత్వం అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆదివాసీ సంఘాలు, పెద్దలు, వేల్పు జాతరల తలపతుల సలహాలు, సూచనలు ఎందుకు తీసుకోలేదని మైపతి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. 1944లో మేడారం గద్దెల మార్పిడి చేయాల్సి వచ్చినపుడు 30 కోయగూడేల పెద్ద మనుషుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం ఆధునీకరణకు రూ.50 కోట్లు రాగానే ఏకపక్ష నిర్ణయాలా? అని ప్రశ్నించారు.
మంత్రి సీతక్క కూడా..
మేడారం సమ్మక వంశమైన రాయిబండాని వంశంలో పుట్టిన మంత్రి సీతక్క కూడా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగుతుంటే స్పందించకపోతే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలని ఆదివాసీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమ్మక దేవర మూలం తో ఆటలు వద్దని హితవు పలికారు. ఈ విషయం లో పునరాలోచన చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం కోసం సమ్మక దేవర కుడివైపు ఉన్న భర్త పగిడిద్దరాజు గద్దెను మార్చడం ప్రకృతి ధర్మాన్ని విస్మరించడమేనని, గద్దెను వెనక్కి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. పూర్వకాలంలో కోయ పెద్దలు వాస్తు విధానం తెలియక గద్దెల నిర్మాణం చేశారా? అని నిలదీశారు.
ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదు
గద్దెల మార్పు విషయంలో ప్రభుత్వాన్ని, మంత్రులు సీతక్క, కొండా సురేఖను విమర్శించడం సరికాదని మేడారం పూజారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం జాతరను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.