వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 17: సాగు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లాలో గిరిజన రైతులు మంత్రి సీతక్క కాన్వాయ్‌ని అడ్డగించారు. మంగళవారం ఆమె వెంకటాపురం (నూగూరు) మండలంలో పర్యటనను ముగించుకొని వెళ్తున్న క్రమంలో ఆరుగుంటపల్లి గ్రామంలో గిరిజన రైతులు ఆమె కాన్వాయిని అడ్డగించారు. కారు దిగి వచ్చిన ఆమె రైతులతో మాట్లాడారు.
పాలెంవాగు ప్రాజెక్టు నీళ్లు బర్లగూడెం పరిధిలోని తమకు అందడం లేదని, ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు సాగు నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెర్లకాలనీ, ఆరుగుంటపల్లి మధ్య ప్రధాన రహదారిపై బ్రిడ్జి కట్టకపోవడంతో సాగు నీరు అందడం లేదని వారు తెలిపారు.
బ్రిడ్జి మంజూరైనా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారని వారు పేర్కొన్నారు. వానకాలంలో కురిసిన వర్షాలకు ప్రధాన కాల్వకు అనేక చోట్ల గండ్లు పడ్డాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సాగునీళ్లు సకాలంలో అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు.