హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చైర్మన్‌గా కొనసాగుతున్న విచారణలో శుక్రవారం నలుగురు ఎమ్మెల్యేల రాతపూర్వక, మౌఖిక విచారణ పూర్తయింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ గడిచిన 20 నెలలుగా కొట్లాడుతున్న విషయం తెల్సిందే. స్పీకర్‌కు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు ఎట్టకేలకు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్నది. దీంట్లో తొలుత ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్‌లపై విచారణ చేపట్టారు. దసరాకు ముందు మొదలైన విచారణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొనగా, శుక్రవారం నాటి విచారణలో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పక్షాన హాజరైన న్యాయవాదులు రాతపూర్వకంగా, మౌఖికంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన న్యాయవాదులతో జరిగిన వాదనల్లో పాల్గొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు గతంలో మాదిరిగానే తమ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పక్షాన హాజరైన న్యాయవాదులు గండ్రమోహన్‌రావు, సోమభరత్, రాంచందర్‌రావు, సంతోష్ తదితరులు గట్టిగా సమాధానం ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్మెంట్లు, వీడియో క్లిప్పింగులు, పేపర్ క్లిప్పింగులు చూపించి ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరుకాకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. ముమ్మాటికీ పార్టీ ఫిరాయించారంటూ అన్ని ఆధారాలను బయటపెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులకు ఒక దశలో ఏం చెప్పాలో పాలుపోలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు ఇరుపక్షాల వాదనలను నోట్ చేసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేల విచారణ ముగిసినట్టు చెప్పారు. త్వరలోనే మరికొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారణకు పిలువనున్నారు.