పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 25: కర్నూల్లో ట్రావెల్ బస్సు దహనం ఘటనను మరువక ముందే రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట వద్ద ఓఆర్ఆర్పై శనివారం మధ్యాహ్నం ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. అతివేగంగా వెళ్తూ రెయిలింగ్‌ను ఢీకొట్టి దాదాపు 20 అడుగులు ఎత్తు నుంచి పల్టీ కొట్టింది. ఆరుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లు, చెకింగ్ ఇన్స్పెక్టర్కు గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. న్యూ గో ప్రైవేటు ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు (ఏపీ 39 యూపీ 1963) ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఓ చెకింగ్ ఇన్స్పెక్టర్తో మియాపూర్ నుంచి ఏపీలోని గుంటూరుకు బయలుదేరింది.
ఎల్బీనగర్లో మరో ముగ్గురు, హయత్‌నగర్‌లో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కాల్సి ఉన్నది. బస్సు పెద్దఅంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్‌రోడ్డు దిగి విజయవాడ జాతీయ రహదారిపైకి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ కిందకు దిగేందుకు పెద్దఅంబర్‌పేట టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే మలుపు వద్ద డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా అతివేగంతో నడిపి ఇనుప రేకులతో ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. గుంటూర్‌కు చెందిన ఆకుల గాయత్రి, మౌనిక, ప్రత్యూష, ఏ ప్రభాకర్, కార్తీక్, షేక్ జహీర్‌తోపాటు డ్రైవర్లు వీరాంజనేయరెడ్డి, శ్రీనివాస్, చెకింగ్ ఇన్స్పెక్టర్ పొలిశెట్టి గోపీ కృష్ణకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుల్లో నలుగురిని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ దవాఖానకు, మరో ఐదుగురిని కంచన్‌బాగ్‌లోని అపోలో దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బస్సును క్రేన్ సహాయంతో తరలించారు. బస్సు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది.