చిల్పూరు, సెప్టెంబర్ 17: కరెంట్ లేకపోవడంతో నీరందక పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామంలో ఎస్ఎస్10 ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పదిహేను రోజులు కావస్తున్నా పట్టించుకోవడం లేదని జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్ గ్రామ రైతులు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మరమ్మతులు చేపట్టడం లేదని, కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, చివరికి తమకు అత్మహత్యలే దిక్కంటున్నారు. ఇప్పటికే 40 ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో మక్క పంట ఎండిపోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్తు అధికారులు స్పందించి సత్వరమే సమస్యను పరిషరించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రభుత్వమే బాధ్యతవహించాలని వారు హెచ్చరించారు.