హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది. నెలల తరబడి చర్చలు జరిపింది. ఆఖరుకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లతో సరిపుచ్చింది. మంగళవారం సర్కారు మార్గదర్శకాలు విడుదల చేసింది. న్యాయం చేస్తామంటే డిప్యూటేషన్లు ఇవ్వడమేనా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు ఆమోద యోగ్యం కాదని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్(టిగారియా) అభిప్రాయపడింది. న్యాయం జరగకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 24, 25న బస్సుయాత్ర నిర్వహిస్తామని రాష్ట్ర బాధ్యులు మధుసూదన్, జనార్దన్, గణేశ్, భిక్షంయాదవ్ ప్రకటించారు.
రెండేండ్లు.. ఆ తర్వాత మరో ఏడాదే
జీవో-317 ద్వారా వేరే జోన్, జిల్లాకు బదిలీ అయ్యి, స్పౌజ్, పరస్పర బదిలీల్లో అవకాశం రానివారు మాత్రమే అందుకు అర్హులు. మొదట రెండేండ్లు అవకాశం కల్పిస్తారు. గరిష్ఠంగా మూడేండ్లు ముగిసిన తర్వాత రొటేషన్ పద్ధతిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారు. ఇవి శాశ్వత బదిలీలు కావు. క్రమశిక్షణా చర్యలు తీసుకున్న వారు అనర్హులు. ఖాళీగా ఉన్న స్థానాల్లో మాత్రమే అవకాశం కల్పిస్తారు. తాత్కాలిక బదిలీలు.. డిప్యూటేషన్ల అవకాశం కల్పించినందుకు తెలంగాణ ఎం ప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
పదోన్నతి పొందిన వారికి అవకాశం లేదనడం దారుణం: ఆర్‌యూపీపీ
జీవో -317 బాధితుల సమస్య పరిష్కారం కోసం జారీచేసిన జీవోను సవరించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ స్టేట్ (ఆర్‌యూపీపీ టీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. పదోన్నతి పొందిన వారు అర్హులు కాదనడం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు అన్నారు. ఉన్న ఖాళీల్లో రెండేండ్ల డిప్యూటేషన్లు ఇచ్చేందుకు ఇన్ని రూల్సా..? అంటూ ప్రశ్నించారు. ఈ జీవోను సవరించకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.