Telangana | హైదరాబాద్, జనవరి30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, నాయకుల తీరుపై సాగునీటి పారుదలశాఖలో ఇంజినీర్లు నలిగిపోతున్నారు. పలువురు నేతలు కక్షసాధింపు చర్యలకు దిగుతుంటే, మరికొందరు పార్టీ ముద్ర వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నచ్చినవారి కోసం అంకితభావం, అనుభవం కలిగిన ఇంజినీర్లను వెళ్లిపోవాలంటూ ఏకంగా ఒత్తిళ్లే చేస్తున్నారు. లేదంటే బలవంతపు బదిలీలకు దిగుతున్నారు. ఈ వైఖరిపై ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పలువరు ఇంజినీర్లు హెచ్చరించారు.
ఈఈలు, డీఈఈలులే కాదు కాంగ్రెస్ నేతల తీరుతో ఓ సీఈ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి ఇరిగేషన్ శాఖలో నెలకొన్నది. క్షేత్రస్థాయిలో ఏఈఈలు, జేఈల పరిస్థితి చెప్పనలవిగా మారిందని ఇంజినీర్లు వాపోతున్నారు. ఎక్కడికక్కడ పెత్తనం చెలాయిస్తున్నారని వాపోతున్నారు. ఈ ఏడాదికాలంలో 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్లను పకనబెట్టి 2005, 2007 బ్యాచ్‌లకు చెందిన పదుల సంఖ్యలో ఇంజినీర్లకు ఉన్నతస్థానాల్లో ఎఫ్ఏసీలుగా నియమించారని బాధిత ఇంజినీర్లు బాహాటంగానే వెల్లడిస్తున్నారు.
ఓ డీఈఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో విశేష సేవలను అందించారు. అయితే అక్కడి కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కొంతకాలం తర్వాత ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతే ఆ వెంటనే సదరు డీఈఈపై కక్షసాధింపు చర్యలకు దిగారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే రెండు నెలలు కూడా తిరగముందే సదరు డీఈఈని బదిలీ చేయాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ నేతకు సన్నిహితంగా ఉంటాడనే నెపం మోపి సదరు డీఈఈని ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బదిలీపై పంపించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఈఈ కూడా కాంగ్రెస్ నేతల వేధింపులకు బాధితుడయ్యారు. పాలమూరు ప్రాజెక్టు డీఈఈ తరహాలోనే ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆ ఈఈని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. హైదరాబాద్‌కు బదిలీ చేసేవరకూ పట్టవీడలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తాజాగా వరంగల్ జిల్లాలో ఓ డీఈఈపై స్థానిక ఎమ్మెల్యే ఏకంగా యుద్ధమే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అకింతభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందిన సదరు డీఈఈపై లేనిపోని అభియోగాలు మోపారు. వద్దంటే వద్దు అంటూ మంకుపట్టుబట్టారు. సదరు డీఈఈని బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చినా ఉన్నతాధికారులు ఒక దశలో ససేమిరా అన్నారు. అయినా ఆ ఎమ్మెల్యే మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఇంజినీర్‌ను బలవంతంగా బదిలీ చేయించారు. ఎట్టకేలకు ఉమ్మడి వరంగల్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బదిలీ చేయించి తన పంతం నెగ్గించుకున్నారు.