“కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811టీఎంసీలు ఉంటే తెలంగాణకు 299టీఎంసీలు, ఏపీకి 512టీఎంసీలని ఒప్పుకున్నరు. 66: 34శాతం నిష్పత్తిలో జలాల వినియోగానికి సంతకాలు చేసి తెలంగాణకు శాశ్వతంగా మరణశాసనం రాశారు.”
– అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
ఇది నాగార్జున సాగర్ జలాశయం. కృష్ణా నదీ జలాల వాడకానికి ఆయువు పట్టు. ఈసారి కృష్ణాకు వరుసగా 70 రోజుల పాటు వరద వచ్చింది. 2024 అక్టోబర్ 31 నాటికే పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యమైన 312 టీఎంసీలకు చేరుకున్నది. ఆ తర్వాత కూడా సాగర్‌కు ఎగువ నుంచి దాదాపు
53,637 క్యూసెక్కుల వరద కొనసాగింది. దిగువకు పోయేది పోను, వాడేది వాడగా, డిసెంబర్ 3వ తేదీకి కూడా సాగర్ 306 టీఎంసీలతో కళకళలాడింది.
కేవలం వంద రోజులు గడిచాయి. ఇవాళ మార్చి15. సాగర్‌లో ఉన్న నీళ్లు కేవలం 148.73 టీఎంసీలు. అంటే డెడ్ స్టోరేజీకి (131 టీఎంసీలు) పోగా అందుబాటులో ఉన్న నీళ్లు కేవలం 17 టీఎంసీలే. సాగర్ కింద ఇంకా పంటలకు తడులు అవసరం ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటికీ సాగరే దిక్కు. మరి కేవలం మూడు నెలల కాలంలో ఏకంగా 164 టీఎంసీలు ఖాళీ అవడానికి కారణం ఏమిటి?
వంద రోజుల క్రితం నిండుగా కళకళలాడిన నాగార్జున సాగర్‌లో మన వాటా నీళ్లు మనకు రాకముందే డెడ్ స్టోరేజీకి దగ్గర కావడానికి కారణం ఆంధ్రప్రదేశ్! వరద ఆగిపోయిన తర్వాత సాగర్ నీళ్లలో ఆంధ్రప్రదేశ్ 75.73 శాతం వాడుకుంటే తెలంగాణ వాడింది కేవలం 24.27 శాతం నీళ్లు మాత్రమే. తాత్కాలిక ఒప్పందం ప్రకారం చూసినా ఏపీ వాడుకోవాల్సింది 66 శాతం మాత్రమే. తెలంగాణకు 34 శాతం రావాలి.
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాసారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఇప్పడేమంటారు? ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరు కదా! పదవిలో ఉన్నది మీరే కదా! మరి 66 శాతం వాటానే వాడుకోవాల్సిన ఏపీ 76 శాతం తరలించుకుపోతుంటే మీరేం చేశారు? తెలంగాణకు 34 శాతం వాటా దక్కాల్సి ఉండగా, కేవలం 24 శాతం నీళ్లే తెచ్చిన పాపం ఎవరిది?
నల్లగొండ జిల్లాలో పంటల్ని ఎండబెట్టి, హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభాన్ని ముంగిట నిలిపి, 11 ఏండ్ల తెలంగాణ చరిత్రలో సాగర్ నుంచి అత్యల్పంగా నీటి వాటా తరలించిన మీరా మరణశాసనాన్ని రాస్తున్నది? లేక కేసీఆర్ సర్కారా? కేసీఆర్ సర్కారు ఉన్న పదేండ్లలో గరిష్ఠంగా (2015-16లో) 36 శాతాన్ని వాడగా, కనిష్ఠంగా చూసినా, వరద పెద్దగా రాని, 2020-21లో కూడా 28 శాతం నీటిని పిండుకోగలిగింది.
ఇప్పుడు చెప్పగలరా? కృష్ణా జలాలపై మరణశాసనాన్ని రాసింది, రాస్తున్నది ఎవరో!
పిల్లి గుడ్డిదైతే ఎలుక ఇల్లంతా ఆడిందట. ఇప్పుడు కృష్ణా జలాల వినియోగం విషయంలో అదే జరిగింది. మొద్దునిద్రలో ఉన్న కాంగ్రెస్ సర్కారు తీరుతో ఏపీ ఈ ఏడాది నిరాటంకంగా కృష్ణా జలాలను కొల్లగొట్టింది. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, దిగువన నాగార్జునసాగర్ కుడి కాలువ.. ఆ రెండు ఔట్లెట్ల నుంచే ఏపీ 450 టీఎంసీలకుపైగా మళ్లించింది. గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా, ఇప్పటికీ ఇంకా నీటి సంవత్సరం మూడు నెలలు మిగిలి ఉండగానే దాదాపు 75 శాతానికిపైగా కృష్ణా జలాలను తరలించుకుపోయింది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసినా వేసవికి ముందే రిజర్వాయర్లు ఖాళీకాగా, నీటికి కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. వెరసి ఏపీ పండుతుండగా, తెలంగాణ రైతాంగం ఎండుతున్నది.
Krishna Water | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్‌రెడ్డి సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చేతికందడమే ప్రశ్నార్థకంగా మారింది. తాగునీటికి తండ్లాడాల్సిన దుస్థితి దాపురించింది. సముద్రంలో కలిసిన 844 టీఎంసీలు పోనూ, ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టుల కింద వినియోగానికి 1023 టీఎంసీలకుపైగా అందుబాటులోకి వచ్చాయి. అందులో తాత్కాలిక కోటాలో భాగంగా ఏపీకి 675.80 టీఎంసీలు, తెలంగాణకు 348.143 టీఎంసీలు కేటాయించారు. ఇందులో తెలంగాణ ఇప్పటివరకు దాదాపు 231 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగా, ఏపీ మాత్రం కోటాకు మించి తరలించుకోపోయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఏపీ సర్కారు దాదాపు 75 శాతానికిపైగా కృష్ణా జలాలను కొల్లగొట్టుకునిపోయింది. వెరసి వేసవికి ముందే శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు అడుగంటిపోయాయి.
ఏపీ ఈ నీటి సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారానే దాదాపు 230 టీఎంసీల కృష్ణా జలాలను కొల్లగొట్టింది. యాసంగి సీజన్ ప్రారంభం కాకుండానే శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేయడం ప్రారంభించింది. గత నవంబర్ నాటికి శ్రీశైలంలో 190 టీఎంసీలు ఉండగా, ఆ తరువాత ఒక్క నెల వ్యవధిలోనే 60 టీఎంసీల జలాలను పోతిరెడ్డిపాడు నుంచి నిరంతరాయంగా తరలించింది. అంతేకాకుండా హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల ద్వారా మరో 10 టీఎంసీలకుపైగా కృష్ణా జలాలను తరలించింది.
దిగువన నాగార్జున్‌సాగర్ వద్ద కుడి కాలువ, పవర్‌హౌజ్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ తరలిస్తూనే ఉన్నది. కుడి కాలువ కింద ఏపీకి వాస్తవంగా 132 టీఎంసీల జలాల కేటాయింపు ఉండగా, ఇప్పటికే 185 టీఎంసీలను తరలించుకున్నది. అంటే కోటాకు మించి 53 టీఎంసీలను అధికంగా కొల్లగొట్టింది. కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 9,000 వేల క్యూసెక్కులు, పవర్‌హౌజ్ నుంచి అదనంగా 5,000 వేల క్యూసెక్కులు నికరకంగా రోజుకు 14,000 క్యూసెక్కుల (ఒక టీఎంసీన్నర) చొప్పున తీసుకెళ్లింది. నవంబర్ నెలాఖరు నుంచే సాగర్ కుడికాలువ ద్వారా జలాల తరలింపు ప్రక్రియను ఏపీ ముమ్మరం చేసింది. దీంతోపాటు ఎడమ కాలువ పరిధి జోన్-3లో ఉన్న ఏపీ ఆయకట్టు కోసం 32 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే 25 టీఎంసీలకుపైగా తరలించింది. మొత్తంగా సాగర్ నుంచి ఏపీ ఇప్పటికే 210 టీఎంసీలు వినియోగించుకోవడం గమనార్హం.
జూన్ 1 నుంచి మే 31 వరకు నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2024-25 నీటి సంవత్సరంలో ఇంకా మూడు నెలలు మిగిలి ఉన్నాయి. సాధారణంగా కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు జూలై నెలాఖరు లేదా ఆగస్టులో ప్రారంభమవుతాయి. ఈ లెక్కన మరో ఐదు నెలలపాటు ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లనే ఇరు రాష్ర్టాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లప్తత, ఏపీ సర్కారు దూకుడు కారణంగా వేసవికి ముందే రెండు రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. శ్రీశైలంలో నీటిమట్టం ప్రస్తుతం 844 అడుగులకు చేరుకోగా 69 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. రిజర్వాయర్ వాస్తవ డెడ్‌స్టోరేజీ 834 అడుగులు కాగా, ఈ సీజన్లో 820 అడుగులుగా నిర్ధారించారు. అక్కడ 40 టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఈ లెక్కన శ్రీశైలంలో వినియోగానికి 29 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌పై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు మొత్తంగా ఏడు జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ప్రస్తుతం 521 అడుగులకు దిగజారింది. ప్రస్తుతం సాగర్‌లో 151 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. సాగర్ డెడ్‌స్టోరేజీ 510 అడుగులు కాగా ఈ ఏడాది 515 అడుగులుగా నిర్ధారించారు. అక్కడ 140 టీఎంలు ఉంటాయి. ఈ లెక్కన సాగర్‌లో వినియోగానికి అందుబాటులో ఉండేది 11 టీఎంసీలే! సాగర్ ఆయకట్టు కింద తెలంగాణలో వేసిన పంటలు చేతికి రావాలంటే మరో నెలరోజులపాటు నీటిని విడుదల చేయాలి. హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నది. రిజర్వాయర్ ఖాళీ అవడంతో నీటికి కటకట తప్పని దుస్థితి ఏర్పడింది.
తెలంగాణ అవసరాలకు కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ, ఇష్టారాజ్యంగా జలాలను తరలించుకుపోకుండా ఏపీని నిలువరించడంలోనూ కాంగ్రెస్ సర్కారు ఆది నుంచీ మొద్దునిద్ర పోతున్నది. ఏపీ నవంబర్ నుంచే రెండు రిజర్వాయర్లను ఖాళీ చేస్తున్న విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు సర్కారు పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. సాధారణంగా ప్రతి యాసంగి సీజన్ ప్రారంభంలోనే త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ఇరు రాష్ర్టాలకు నీటి వాటాలను తేల్చాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సమావేశం జరగనే లేదు. త్రిసభ కమిటీ సమావేశం కోసం పట్టుబట్టలేదు. రిజర్వాయర్లన్నీ అడుగంటిన తరువాత, రైతులు ఆందోళనలకు దిగిన తరువాత మాత్రమే హడావుడి చేసింది. తెలంగాణ కోటా కింద ఇంకా 134 టీఎంసీలను వాడుకోవాల్సి ఉన్నదని, ప్రస్తుత నీటి అవసరాల కోసం 116 టీఎంసీలు కావాలని బోర్డు ముందు ఇండెంట్ పెట్టింది. కానీ, వారం రోజుల్లోనే 63 టీఎంసీలకు రాజీపడింది. దానికీ కట్టుబడకుండా మరింత రాజీపడి చివరకు 40 టీఎంసీలను వినియోగించుకునేందుకు అంగీకరించింది. దీంతో తెలంగాణ సాగర్ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకం మారింది. కాంగ్రెస్ వైఫల్యం కారణంగా కుడికాలువ కింద ఈ యాసంగి సీజన్లో ఏపీలో సాగుచేస్తున్న 12 లక్షల ఎకరాలు పండుతుండగా, ఎడమ కాలువ కింద తెలంగాణ ఆయకట్టు ఎండుతున్నది. హైదరాబాద్‌కు తాగునీటి గండం పొంచి ఉన్నది. కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్-2, జోన్-3లోని ఏపీ ఆయకట్టుకు సంబంధించి సాగునీటిని విడుదల చేయాలంటూ గత డిసెంబర్ నుంచే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖలు రాస్తున్నది. బోర్డు సైతం ఎలాంటి సమావేశాలను నిర్వహించకుండానే నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చింది. ఏపీకి కేటాయించిన 32 టీఎంసీల కోటాలో డిసెంబర్ నాటికే 9.55 టీఎంసీలను వినియోగించుకోగా, ఆ తరువాత మరో 15.86 టీఎంసీలు వినియోగించుకున్నది. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో మరో 18 టీఎంసీలు కావాలని పట్టుబట్టింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే ఏపీ తన కోటాకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు నాటికే 25 టీఎంసీలను వినియోగించుకున్నది. మార్చి 1 నుంచి కూడా రోజుకు 3,530 క్యూసెక్కుల చొప్పున జలాలను ఏపీకి తరలిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నీరు అందడం లేదంటూ ఏపీనే మళ్లీ తెలంగాణపై ఫిర్యాదులకు దిగడం గమనార్హం.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ తూముల షట్టర్లను మూసివేసి దిగువన ఏపీ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్న దుస్థితి నెలకొన్నది. ఇటీవల ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలోని తూటికుంట్ల మేజర్ కాలువ తూమును మూసివేసి, బోనకల్ బ్రాంచ్‌కెనాల్ నుంచి ఆంధ్రాకు నీటిని సరఫరా చేశారు. దీంతో బోనకల్లు, చింతకాని మండలాల్లోని తెలంగాణ ఆయకట్టు ఎండిపోతున్నది. జోన్-2లో బ్రాంచ్ కెనాల్స్ కింద తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు చెందిన ఆయకట్టు కలిసి ఉంటుంది. అక్కడా ప్రస్తుతం ఇదే పరిస్థితి. జోన్-3లో మైలవరం నుంచి పూర్తిగా ఏపీ ఆయకట్టు ఉంటుంది. ఆ ప్రాంతానికి నీటిని తరలించేందుకు తెలంగాణ ప్రాంతానికి నీటిని సరఫరా చేసే కాలువల తూములను సీల్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలువురు ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం అందుకు ఊతమిస్తున్నారని రైతులు చెప్తున్నారు. ఫలితంగా ఎడమ కాలువ కింద, ఎగువ ఉన్న తెలంగాణ ఆయకట్టు ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే కోటాకు మించి జలాలను వినియోగించుకున్న ఏపీ.. ఎడమ కాలువకు మరిన్ని నీళ్లు కావాలంటూ బోర్డుకు లేఖ రాసింది. మరోవైపు, రేవంత్ సర్కా రు పట్టింపులేనితనంతో సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న తెలంగాణ ఆయకట్టు సైతం ఎండిపోతున్నది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పొడవు మొత్తం 180 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని మూడు జోన్లుగా విభజించారు. జోన్-1, జోన్-2 కలిపి తెలంగాణలో 6.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. అదేవిధంగా జోన్-2, జోన్-3 పరిధిలో 3.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎడమ కాలు వ మొత్తానికి 132 టీఎంసీల కేటాయిం పు ఉండగా, అందులో ఏపీ వాటా 32.25 టీఎంసీలు కాగా, మిగిలినది తెలంగాణ వాటా. నాగార్జునసాగర్‌లో నీటినిల్వలు పడిపోవడంతో ఎడమ కాలువకు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో జోన్-1, జోన్-2లోని తెలంగాణ ఆయకట్టుకే నీరందని దుస్థితి నెలకొన్నది. ఏపీ ఇష్టారాజ్యంగా, కోటాకు మించి కృష్ణా జలాలను మళ్లిస్తున్నా చోద్యం చూసిన రే వంత్ సర్కారు, ఇప్పుడు కూడా ఎగువన ఎండబెడుతూ దిగువకు సజావుగా నీళ్లను వదిలిపెట్టడంపైనే దృష్టిపెట్టింది. జోన్-1, జోన్-2లో ఎడమ కాలువపై ఉన్న డిస్ట్రిబ్యూటరీలను మూసి వేసి మరీ దిగువ ఆయకట్టుకు నీటిని వదిలేస్తున్నది.
గత నవంబర్ నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు