వేములవాడ, జూలై 29: దేవాదాయ శాఖలో ఉద్యోగుల బది‘లీలలు’ జరుగుతున్నాయి. ఉన్నతాధికారులకు నచ్చినోళ్లకు అందలం ఎక్కిస్తూ వారు ఎంచుకున్న ఆలయానికి పంపిస్తున్నారని, మరికొందరికి మాత్రం నిబంధనల పేరు చెప్పి మొండిచేయి చూపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఉద్యోగులను గత సంవత్సరం ఆగస్టులో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు యాదగిరిగుట్టకు బదిలీ కాగా, అకడినుంచి పలువురు వేములవాడకు వచ్చారు. అయితే, పది పదిహేను రోజులు గడువక ముందే యాదగిరిగుట్ట నుంచి రాజన్న ఆలయానికి బదిలీపై వచ్చిన రాజన్‌బాబును తిరిగి యాదగిరిగుట్టకు, యాదగిరిగుట్టకు వెళ్లిన వేములవాడ రాజన్న ఆలయ పర్యవేక్షకుడు గోలి శ్రీనివాస్‌ను వర్ ఆర్డర్ పేరిట వేములవాడ ఎమ్మెల్యేకు పీఏగా నియమిస్తూ అప్పటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అదే నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఇటీవల యాదగిరిగుట్టలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పర్యవేక్షకుడు రాజన్‌బాబును వేములవాడకు రిటర్న్ చేసేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు సిద్ధంచేసినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో సదరు పర్యవేక్షకుడు వేములవాడలో రిపోర్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, రాజన్న ఆల యం నుంచి కొమురవెల్లి ఆలయానికి బదిలీపై వెళ్లిన పర్యవేక్షకుడు శ్రీరాములు వచ్చే అక్టోబర్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. జీవో నంబర్ 64 నిబంధనల ప్రకారం ఏడాదిలోపు రిటైర్మెంట్ ఉన్నవారిని మాతృ సంస్థకు పంపాలనే నిబంధన ఉన్నది. ఈ క్రమంలో తనను మాతృ సంస్థకు పంపించాలని ఇటీవల దేవాదాయ శాఖకు అర్జీ పెట్టుకోగా, రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉన్నదంటూ తిరసరించారు. దీంతో రాజన్‌బాబు ను రిటర్న్ చేసేందుకు అడ్డురాని నిబంధన ఇప్పుడెందుకు వస్తుందని పేర్కొంటున్నారు.