e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home తెలంగాణ కరోనా దొంగల్ని చేసింది!

కరోనా దొంగల్ని చేసింది!

కరోనా దొంగల్ని చేసింది!
  • మహమ్మారితో చితికిపోతున్న కుటుంబాలు
  • ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాల బాట
  • ఏటీఎంలు, ఫైనాన్స్‌ కంపెనీలే లక్ష్యం

‘కరోనా వల్ల చేసేందుకు పని దొరుకలేదు. ఖర్చులు తీరేందుకు వేరే మార్గం కనిపించలేదు’ దోపిడీ కేసులో పట్టుబడ్డ ఓ దొంగ వాంగ్మూలం.
‘కరోనా కారణంగా ఉపాధి పోయింది. పొట్ట నింపుకొనేందుకు తప్పలేదు’ చోరీకి యత్నించి పట్టుబడ్డ మరో నిందితుడి సమాధానం.
ఇలా చాలా దొంగతనాలు, చోరీ యత్నం కేసుల్లో నిందితుల వాంగ్మూలాల్లో కరోనానే కారణంగా కనిపిస్తున్నది. కనిపించని వైరస్‌ తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఎంతోమందిని దొంగలుగా మారుస్తున్నది. ఏటీఎం కేంద్రాలు, ఫైనాన్స్‌ సంస్థలే లక్ష్యంగా జరుగుతున్న చోరీల వెనుక వైరస్‌ విజృంభణే ప్రధాన కారణ మవుతున్నది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా పెద్ద కష్టమే తెచ్చింది. 16 నెలలుగా తన పంజాతో ఆరోగ్యపరంగానే కాదు, చాలామందిని ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నది. కోట్ల మంది పనులు దొరకక డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆర్థిక కష్టాలు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు నేరాలబాట పడతున్నారు. తక్షణమే డబ్బు దోచేందుకు ఏటీఎం సెంటర్లు, ఫైనాన్స్‌ సంస్థలనే లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. మరికొందరు చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్తున్నారు.

కరోనా తెచ్చిన ఆర్థిక కష్టం.. చోరీల మార్గం

  • సైబరాబాద్‌ దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ సెంట్రింగ్‌ కార్మికుడు పనుల్లేక తీవ్ర ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. ఓ ఫైనాన్స్‌ సంస్థ అతన్ని బ్లాక్‌ లిస్టులో పెట్టడంతో రుణం దొరకలేదు. ఎక్కడా పైసా పుట్టలేదు. గండిమైసమ్మ చౌరస్తాలో ఉన్న ఆ ఫైనాన్స్‌ సంస్థ మీద కార్మికుడి కన్నుపడింది. గతంలో ఈ సంస్థలోనే బంగారం కుదువ పెట్టి నగదు పొందాడు. అర్ధరాత్రి ఒంటరిగానే కార్యాలయం వెనకవైపు గోడకు సుత్తితో రంధ్రం చేసి లోపలికి వెళ్లాడు. లాకర్‌ను ముట్టుకోవడంతో అలారం మోగింది. ఆందోళనకు గురయి పారిపోయాడు. కానీ, సీసీ కెమెరా ఆధారంగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు.
  • కూకట్‌పల్లి ప్రాంతంలో వారం కిందట హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రం వద్ద పట్టపగలే కాల్పులు జరిపిన బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.ఐదు లక్షలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులు కూలీలని తేలింది. అంతకు 25 రోజుల ముందే జీడిమెట్లలోని ఓ మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో చోరీచేసి రూ.1.9 లక్షలు దొంగతనం చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వద్ద చోరీలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వ్యసనాలు, ఇతర అవసరాలకు డబ్బు సరిపోక దోపిడీకి స్కెచ్‌ వేశామని తెలిపినట్టు సమాచారం. ఇందులో ప్రధాన సూత్రధారి పాత నేరస్థుడు కాగా, మరో యువకుడు తాజాగా తలెత్తిన ఆర్థిక భారాన్ని అధిగమించేందుకు అతనితో చేతులు కలిపాడని తెలిసింది. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.
  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నాచారం ప్రాంతంలో ఓ ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాన్ని ఇద్దరు వ్యక్తులు టార్గెట్‌ చేశారు. మెషిన్‌ నుంచి డబ్బు దోచే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే చోరీకి యత్నించామని విచారణలో చెప్పినట్టు తెలిసింది.

తాగిన మత్తులో చోరీకి యత్నాలు

ఇక మందుబాబులు మద్యం ఎక్కువై డబ్బు కోసం ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మత్తులో ఏటీఎం సెంటర్లలోకి వెళ్లి రాళ్లతో మెషిన్‌ను కొట్టడం, మానిటర్‌ను బండరాయితో బాదడం, తెరుచుకోకపోతే అందులోనే మూత్రవిసర్జన చేయడం వంటి విచిత్ర ఛేష్టలకు దిగి చివరకు పోలీసులకు చిక్కుతున్న ఘటనలు నగరంలో చాలా నమోదయ్యాయి. మరికొందరు రాత్రిళ్లు నిర్మానుష్యంగా ఉండే ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేస్తున్నారు. ఒంటరిగా డబ్బు డ్రా చేసుకుని వెళ్లేవారిపై దాడి చేసి డబ్బు, మొబైల్‌ ఫోన్లను దోపిడీ చేస్తున్న సంఘటనలు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా దొంగల్ని చేసింది!

ట్రెండింగ్‌

Advertisement