తాండూర్ : కొడుకే జీవితంగా బతికిన తల్లి చివరకు ఆ కొడుక్కి తలకొరివి పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎవరూ ఊహించలేరు. ఆ తల్లి కడుపుకోత ఎవరూ తీర్చలేరు. అప్పటికే భర్తను కోల్పోయిన ఆమె కొడుకులు ఉన్నారన్న ఆశతో బతికింది. ఆమె ఆశలన్నీ ఆ బిడ్డలపైనే పెట్టుకుంది. చేతికందే వయస్సులో పెద్ద కొడుకు ఏడాది క్రితం చనిపోగా గురువారం చిన్న కొడుకు చనిపోయాడు. ఏకాకైనా ఆమె చివరికి కన్న కొడుకు చితికి తలకొరివి పెట్టాల్సిన గతి పట్టింది.
మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandur ) మండలం మాదారం గ్రామానికి చెందిన ఓ తల్లి గుండె కోత. ఆమె అనుభవించిన ఆత్మక్షోభ మాటల్లో వర్ణించలేనిది. మాదారం టౌన్ షిప్ ( Madaram Township ) నకు చెందిన సలాకుల రాజమ్మ చిన్న కుమారుడు సలాకుల నరేష్ ( Naresh) గురువారం సాయంత్రం మృతిచెందాడు. శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించగా నరేష్ చితికి ఆమె నిప్పు పెట్టింది.
రాజమ్మ సింగరేణిలో పనిచేస్తూ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఈ క్రమంలో రాజమ్మ రిటైర్మెంట్ చేసింది. ఏడాది క్రితం పెద్ద కుమారుడు రమేష్ మరణాన్ని మరచిపోక ముందే చిన్న కుమారుడు నరేష్ గురువారం సాయంత్రం ఫిట్స్‌తో ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. చిన్న కుమారుడు నరేష్‌కు ఒక కూతురు ఉంది.