Real Estate | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత డిసెంబర్ వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లిన ‘రియల్’ వ్యాపారంలో ఈ ఐదు నెలల కాలంలో స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఇది ఇలాగే కొనసాగితే ‘తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో నాలుగైదు ఎకరాలు కొనొచ్చు’ అని గొప్పగా చెప్పుకున్న మాటలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తగ్గిన క్రయవిక్రయాలు
అధికారిక గణాంకాల ప్రకారం గత నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా రిజిస్టర్ అయిన వ్యవసాయేతర ఆస్తుల డాక్యుమెంట్ల సంఖ్య 86,534 మాత్రమే. నిరుడు ఈ సంఖ్య 1.55 లక్షలుగా ఉన్నది. నిరుటితో పోల్చితే 56 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిరుడు రూ.1100 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.930 కోట్లకు పరిమితమైంది. సాధారణంగా ఎన్నికల వేళ రిజిస్ట్రేషన్లు 10-15 శాతం వరకు తగ్గుతుంటాయన్నది బిల్డర్లు, రియల్ వ్యాపారుల మాట. కానీ, ఈసారి ఏకంగా 44 శాతం తగ్గడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వాతావరణమే ఉన్నప్పటికీ ఆ ఏడాది ఏప్రిల్లో 1.33 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈసారి మాత్రం వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కలిపినా ఏప్రిల్లో 1.25 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం గమనార్హం. 2022 డిసెంబర్ నుంచి 2023 మే 10 మధ్య ఐదు నెలల కాలంలో వ్యవసాయ భూముల అమ్మకం, విరాసత్, భాగపంపకం కలిపి 3.55 లక్షల క్రయవిక్రయాలు జరిగితే, గత డిసెంబర్ నుంచి శుక్రవారం వరకు ఐదు నెలల కాలంలో 2.53 లక్షలు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
కుదేలుకు కారణం ఇదే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ రద్దుతో హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైందని పేర్కొన్నారు. కొంతకాలంపాటు భవన నిర్మాణ అనుమతులు, పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయడంతో ఈ ప్రభావం కూడా కనిపిస్తున్నదని చెప్తున్నారు. తొమ్మిదేండ్లుగా లేని కరెంటు కోతలు, సాగు, తాగునీటికి ఇబ్బందులు మొదలుకావడంతో కంపెనీలు పునరాలోచిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు రైతుబంధు కుదిస్తామని చెప్తుండడం, ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, పంటలు ఎండిపోవడం, ధాన్యం కొనుగోళ్లు వంటి పరిణామాలతో సాగుభూములపై పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు.
ఆర్ఆర్ ట్యాక్స్ భయం
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చదరపు అడుగుకు రూ. 68 చొప్పున వసూలు చేస్తూ అనుమతులిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించడం వంటివి పెట్టుబడులను అడ్డుకుంటున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆలోచిస్తున్నట్టు ఆ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సైతం ఆగిపోయే పరిస్థితి ఉన్నదని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని చోట్లా సమగ్రాభివృద్ధికి కృషి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే ఎక్కువగా మహబూబ్నగర్ వైపే పెట్టుబడులు తరలించుకుపోతారని అర్థమవుతున్నదని అంటున్నారు. ఇది కూడా మిగతా ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నదని చెప్తున్నారు.
జిల్లాల రద్దు వార్తలతో గందరగోళం
10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలు ‘రియల్’ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. కొత్తగా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, విద్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడుల రాకతో ఆయా పట్టణాలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. అపార్ట్మెంట్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను కుదిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఏ జిల్లా రద్దవుతుందో తెలియక పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. మండలాల కుదింపు వార్తలు సైతం గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమవుతున్నాయి. కొన్నిచోట్ల అడ్వాన్స్ మీద నడిపించే వ్యాపారులు లాభం రాకపోయినా ఫర్వాలేదని వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో దక్కిందే చాలు అన్నట్టుగా తక్కువకు అమ్ముకొంటున్నారని తెలిసింది.