KTR | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్దు’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సంఘటితంగా కొట్లాడి రేవంత్ సర్కార్‌కు చుక్కలు చూపుదామని సూచించారు. కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సాక్షిగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధంకావాలని నిర్దేశించారు. పోయింది అధికారమే తప్ప..పోరాటపటిమ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కొట్లాడే కార్మిక సంఘాల నేతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు.
సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలోనే కార్మికులకు న్యాయం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడ్డ 15 రోజుల్లోనే హమాలీల సమస్యలు పరిష్కరించారని, రాష్ట్రం ఏర్పడక ముందు 8 రూపాయలు ఉన్న కూలీని 26 రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
కరోనాకాలంలో అష్టకష్టాలు పడ్డ 35 లక్షల మం ది వలస కార్మికులను కేసీఆర్ ఆదుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. వారికి ఓట్లు లేకున్నా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వారికి కష్టకాలం లో కడుపునిండా అన్నంపెట్టి వెయ్యి చొప్పున చేతి లో పెట్టి సొంతూళ్లకు పంపించి గొప్ప మనుసును చాటుకున్నారని కొనియాడారు. సఫాయి కార్మికుల శ్రమను గుర్తించి 3 సార్లు వేతనాలు పెంచారని తెలిపారు.
2004లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ దేశంలోని అసంఘటిత రంగ కార్మికుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కేటీఆర్ చెప్పారు. వేలాదిమంది బీడీ కార్మికులకు ఇండ్లు మంజూరు చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 4.5 లక్షల మంది బీడీలు చుట్టే ఆడబిడ్డలకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. సమైక్య పాలనలో అంగన్వాడీలకు తమకు కనీస వేతనమివ్వాలని అడిగిన పాపానికి నాటి సర్కారు గుర్రాలతో తొక్కిస్తే.. స్వరాష్ట్రంలో కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. రూ.4500 ఉన్న వారి వేతనాన్ని ఏకంగా రూ.13,650కి పెంచి ఆదుకున్నారని చెప్పారు.
2014లో రూ. 2500 ఉన్న ఆశ కార్యకర్తల వేతనాలను రూ. 9,750కి పెంచి వారి కండ్లల్లో ఆనందం చూస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులతో కొట్టించి పైశాచికానందం పొందారని దుయ్యబట్టారు. రూ. 9000 ఉన్న హోంగార్డుల వేతనాన్ని రూ. 27వేలకు పెంచారని, 12లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పీఆర్సీ పరిధిలోకి తెచ్చిన దేశంలోనే ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అర్చకులు, మౌజమ్‌లకు సైతం గౌరవవేతనమిచ్చి గౌరవించారని, 20 లక్షల మంది క్యాబ్, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చి ధీమాగా నిలిచారని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. రిసోర్స్ పర్సన్లకు ఆరునెలలుగా, మున్సిపల్ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలందక ఆకలితో అలమటిస్తుంటే సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఆటోడ్రైవర్లను కూడా మోసం చేశారని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ పదేండ్లలో రూ.4 వేల కోట్ల అప్పులు చేసి అనేక ఆస్తులు సృష్టించారని, భూముల విలువ పెంచి పేదలకు ఆర్థిక భరోసా కల్పించారని, నల్లగొండ జిల్లా దామరచర్లలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ కట్టారని, కాళేశ్వరం లాంటి మహోన్నత ప్రాజెక్టుతో పాటు సచివాలయం, 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, వైద్యశాలలు, గురుకులాలు నిర్మించారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.40 లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసిందేమిటని నిలదీశారు. పాలన చేతగాక అప్పుల విషయంలో బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఆయన తప్పుడు లెక్కలను కార్మిక నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
50 ఏండ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్‌కు సంపద పెంచడం తెలుసని గొప్పలు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని ఎద్దేవాచేశారు. 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అడుగుతుంటే ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారని దునుమాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని కార్మిక నాయకులకు కేటీఆర్ సూచించారు. ప్రశ్నించేవారికి బీఆర్ఎస్ అడుగడుగునా అండగా ఉంటుందని స్పష్టంచేశారు. సర్కారు తప్పుడు కేసులు పెడితే లీగల్ టీంలను పంపించి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆపన్నులు ఎప్పుడొచ్చినా తెలంగాణ భవన్ జనతా గ్యారెజ్ తరహాలో ఆదుకుంటుందని అభయమిచ్చారు. కార్మికసంఘాలు భయంలేకుండా కార్యాచరణకు పూనుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్నివర్గాలను దగా చేసిందని విమర్శించారు. ఆనాడు క్యాలెండర్ ఆవిష్కరణను ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేదీప్యమానంగా వెలిగిన రంగాలు నేడు ఆగమైపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమస్ఫూర్తితో కార్మిక సంఘాలు ఏకోన్ముఖులై కాంగ్రెస్ దుర్మార్గాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మికలోకానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ 48 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల బతుకులతో చెలగాటమాడుతున్నదని బీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు రూప్సింగ్ ధ్వజమెత్తారు. ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ సంక్షేమబోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి 12వేల చొప్పున ఇస్తామని చెప్పిన సర్కార్ నట్టేటముంచిందని ధ్వజమెత్తారు.