హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills By-Election) వేళ కలిసికట్టుగా పనిచేయాల్సిందిపోయి, ఇద్దరు ఎడముఖం, పెడముఖం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఇన్చార్జి మంత్రులు పాల్గొనకపోగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కనీస సమాచారం లేదని తెలిసింది. పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై జరిగిన ఈ కీలక భేటీలో పీసీసీ అధ్యక్షుడిని ఆహ్వానించకపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. దీనికి పోటీగా సోమవారం గాంధీభవన్‌లో ప్రత్యేక సమావేశం జరిగినట్టు సమాచారం.
ఈనెల 11న జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం వంటి కీలకాంశాలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినట్టు సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం లేదని తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ తదితరులతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారట. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యంత ముఖ్యమైన మీటింగ్‌కు సీఎంను ఆహ్వానించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆదివారం నాటి సమావేశానికి పీసీసీ అధ్యక్షుడిని పిలువకపోవడం వల్లే సోమవారం పోటీగా మీటంగ్ పెట్టినట్టుగా ఉన్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.