TPCC | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఢిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్‌కుమార్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇంతకాలం సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన పదవీకాలం గత జూలైలోనే ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం రెండు, మూడు నెలలుగా పార్టీ నేతలతో చర్చలు జరిపింది.
పీసీసీ అధ్యక్ష పీఠం కోసం మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎంపీ బలరాంనాయక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ అధిష్ఠానం మహేశ్కుమార్గౌడ్కే బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాతినిథ్యం లేకపోవడంతో, పీసీసీ అధ్యక్ష పదవినైనా ఇస్తారని ఆ వర్గం నేతలు భావించారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కోరారు. మాదిగలకు సైతం మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో పీసీసీ పీఠం కోసం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పోటీపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అండదండలు ఉండటంతో మహేశ్‌కుమార్‌గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చిన మహేశ్‌కుమార్‌గౌడ్.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013-14లో ఉమ్మడి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో టీపీసీసీ కార్యదర్శిగా, 2021లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024లో తొలిసారిగా శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు.
1994లో డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు క్యాబినెట్లో స్థానం లభిస్తుందని అప్పట్లో ఊహించారు. కానీ, అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా లేకపోవడంతో అవకాశం చేజారిందని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభలోకి ప్రవేశించారు.
పేరు: బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్
పుట్టిన తేదీ : 1966 ఫిబ్రవరి 24
భార్య: సంధ్యారాణి
సంతానం: ఇద్దరు కొడుకులు (రుత్విక్గౌడ్, ప్రణవ్గౌడ్)
స్వస్థలం: రహత్‌నగర్, భీమ్‌గల్ మండలం, నిజామాబాద్ జిల్లా