నల్లగొండ ప్రతినిధి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే కలహాల కాపురానికి మారుపేరు! సొంత జిల్లాలోని కీలక నేతల మధ్యనే అస్సలు పొసగదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోడయ్యారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో సంబంధం లేకుండానే పొంగులేటి సాగిస్తున్న పర్యటనలు కాంగ్రెస్‌లో చిచ్చురేపుతున్నాయి. ఇప్పటికే తమను ఇన్చార్జి మంత్రుల హోదా నుంచి తొలగించారన్న మంట మీద ఉన్న ఆ ఇద్దరు మంత్రులకు.. పొంగులేటి పర్యటనలు పుండు మీద కారం చల్లిన చందంగా మారా యి. ఉమ్మడి జిల్లా నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా కొనసాగుతుండగా, ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నియమితులయ్యారు. సాధారణంగా ఏ జిల్లాలోనైనా సరే స్థానిక మంత్రులతో కలిసి ఇతర మంత్రులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ, నల్లగొండలో మాత్రం జిల్లా మంత్రులతో సంబంధం లేకుండా మంత్రి పొంగులేటి పర్యటనలు సాగుతుండటం కలకలం రేపుతున్నది.
ఆదినుంచీ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో మంత్రి పొంగులేటి సంబంధాలు నెరుపుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పొంగులేటికి అత్యంత సన్నిహితుడనే పేరున్నది. ఆయన తన నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాల్లో పొంగులేటిని భాగస్వామ్యం చేస్తున్నారు. పొంగులేటి ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లే క్రమంలో నకిరేకల్‌లో ఆగడం, వీరేశం ఇంటికి వెళ్లడం పరిపాటిగా మారింది. వీరేశం కోఆర్డినేషన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూడా పొంగులేటితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నా రు. నియోజకవర్గాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే వీరంతా హాజరువుతుంటారు. అదే సందర్భంలో జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పర్యటనల పట్ల మాత్రం ఎమ్మెల్యేలు అంత ఆసక్తి ప్రదర్శించడం లేదన్న చర్చ జరుగుతున్నది. దీంతో తమ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనలేమిటి? అది కూడా తాము లేకుండానే ఎలా పాల్గొంటారు? ఆయ న వస్తే మిగతా ఎమ్మెల్యేలు వెళ్లడం ఏమిటి? అన్నది జిల్లా మంత్రులను ఆలోచనల్లో పడేసింది. ఇప్పటికే నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇక్క డ కోమటిరెడ్డి వర్గీయులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి తోడు కోమటిరెడ్డి లేకుండానే నకిరేకల్ కార్యక్రమాల్లో వీరేశం ఆహ్వానం మేరకు పొంగులేటి రావడం, మీటింగ్‌ల్లో పాల్గొనడం వీరికి అస్సలు గిట్టడం లేదన్న చర్చ జరుగుతున్నది.
22న నకిరేకల్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేముల వేరేశం ఏర్పాటుచేశారు. ఇందులో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొనగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ, మంత్రి కోమటిరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. సచివాలయంలో ఏదో సబ్ కమిటీ మీటింగ్ ఉన్నదన్న పేరుతో నకిరేకల్‌కు రాలేదు. అయితే నల్లగొండ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏమిటన్న ఆగ్రహంతోనే దీనికి దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని అదే రోజు సాయంత్రం మంత్రి ఉత్తమ్ వద్ద కోమటిరెడ్డి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘మనం లేకుండా ఆయన వచ్చుడేంది? దీనికి ఎమ్మెల్యేలను పిలుచుకోవడం ఏమిటి? జిల్లా మంత్రులంటే లెక్కా లేదా వీళ్లకు? అసలు ఏమనుకుంటున్నారో..’ అంటూ కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయినట్టు సమాచారం. ఉత్తమ్ స్పందిస్తూ.. ‘అంతా అట్లా నడుస్తున్నది… చూద్దాం టైం వస్తది కదా..’ అన్నట్టు తెలిసింది.
తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఈ నెల 19న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీకి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. కానీ ఉత్తమ్, కోమటిరెడ్డి రాలేదు. ఇక్కడ కూడా బీర్ల అయిలయ్య, ఎంపీ చామల, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా మంత్రులు టైం ఇచ్చాకే సంబంధిత శాఖ మంత్రిని ఆహ్వానించడం పరిపాటి. కానీ, ఇక్కడ జిల్లా మంత్రులతో సంబంధం లేకుండానే పొంగులేటి పర్యటనలు ఖరారవుతుండటం గమనార్హం.
నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరూ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి కావాలనే చెక్ పెడుతున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ సాగుతున్నది. అందులోభాగంగానే ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతల నుంచి కోమటిరెడ్డిని, కరీంనగర్ నుంచి ఉత్తమ్‌ను తప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. నల్లగొండ ఇన్చార్జి ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్‌కు పంపి, ఇక్కడ కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. లక్ష్మణ్‌కుమార్ నియమాకంపై కూడా జిల్లా మంత్రులకు కనీస సమాచారం లేదు. దీంతో లక్ష్మణ్‌కుమార్ జిల్లాలో అడుగుపెట్టేందుకు సాహించడం లేదు. ఇటీవల పొంగులేటి పాల్గొన్న రెండు కార్యక్రమాలకు ఇన్చార్జి మంత్రి హోదాలో లక్ష్మణ్‌కుమార్‌ను ఆహ్వానించినప్పటికీ, జిల్లా మంత్రులు లేకుండా తాను పాల్గొంటే, కొత్త పంచాయితీ ఎందుకున్న ధోరణితో దూరంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, ఇన్చార్జి మంత్రు ల బాధ్యతల నుంచి తొలగించిన తరువాత జిల్లా మంత్రులు ఇద్దరూ గత పక్షం రోజులుగా జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. తాజాగా గురువారం కోమటిరెడ్డి నల్లగొండకు రాగా, శుక్రవారం ఉత్తమ్ తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం.