PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): మీ నెత్తిపై రూ. 1.27 లక్షల అప్పు ఉంది. ఆశ్చర్యపోతున్నారా? ఎవరికీ బకాయి పడకుండానే అంత పెద్దమొత్తంలో అప్పు ఉండడమేంటని అనుకొంటున్నారా? అవును.. కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 185.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. దేశ జనాభా 145 కోట్లుగా తీసుకొంటే.. సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకూ ప్రతీఒక్కరిపై రూ. 1.27 లక్షల అప్పు ఉన్నది. మరో విషయమేంటంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా చేయనంత అప్పు పీఎం మోదీ చేశారు. 11 ఏండ్ల వ్యవధిలోనే రూ. 130 లక్షల కోట్ల రుణాలు తీసుకొన్నారు. సాంకేతిక రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్గణాంకాలతో సహా వెల్లడించిన వాస్తవాలు ఇవి.
ప్రశ్న: మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత అప్పు చేసింది?
గ్రోక్: 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకూ అంటే గడిచిన 11 ఏండ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ. 130.27 లక్షల కోట్ల అప్పు చేసింది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు దేశం అప్పు రూ. 55 లక్షల కోట్లుగా ఉన్నది. బీజేపీ పాలనలో అప్పులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అలా మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంనాటికి దేశం మొత్తం అప్పు రూ. 185.27 లక్షల కోట్లకు చేరింది.
ప్రశ్న: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని హయాంలో ఎక్కువగా అప్పులు తీసుకోవడం జరిగింది?
గ్రోక్: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పలువురు ప్రధానులు అప్పులు చేశారు. అయితే మోదీ హయాంలో అంటే 2014-2025 మధ్యలోనే ఎక్కువగా అప్పులు చేయడం జరిగింది. 2014లో దేశం అప్పులు రూ. 55 లక్షల కోట్లుగా ఉంటే 2024-25 నాటికి రూ. 185.27 లక్షల కోట్లకు చేరాయి. అంటే రూ. 130.27 లక్షల కోట్ల అప్పు కేవలం మోదీ హయాంలోనే జరిగింది. సంఖ్యాపరంగా చూస్తే మిగతా ప్రధానులతో పోలిస్తే మోదీ హయాంలోనే అప్పులు పెరిగాయి.
ప్రశ్న: జీడీపీలో దేశ అప్పు ఎంత శాతంగా ఉన్నది?
గ్రోక్: 2025 ఏప్రిల్ నాటికి దేశ జీడీపీ 4.3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తే.. దేశ అప్పులు రూ. 185.27 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే జీడీపీలో అప్పుల వాటా 57 శాతంగా చెప్పొచ్చు.
ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును బట్టి దేశంలో ఒక్కో పౌరుడి నెత్తిపై ఎంత అప్పు ఉన్నట్టు?
గ్రోక్: దేశ జనాభా 145 కోట్లుగా తీసుకొంటే, దేశ అప్పు రూ. 185.27 లక్షల కోట్లు కాబట్టి.. ఒక్కో పౌరుడి నెత్తిపై రూ. 1,27,772 అప్పు ఉన్నట్టు భావించవచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల రుణాన్ని కూడా ఇందులో కలిపితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణం రూ. 270 లక్షల కోట్లకు చేరుతుంది. అప్పుడు ఒక్కో పౌరుడి నెత్తిపై అప్పు రూ. 1,86,207గా ఉంటుంది.
ప్రశ్న: మోదీ ప్రభుత్వ హయాంలో విదేశీ అప్పులు ఎన్ని ఉన్నాయి?
గ్రోక్: మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2024 వరకూ విదేశీ అప్పులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు విదేశీ అప్పు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటే, 2024 జూన్ నాటికి ఇది రూ. 57 లక్షల కోట్లకు చేరింది. అంటే పదేండ్ల వ్యవధిలో విదేశీ అప్పు రూ. 27 లక్షల కోట్లు పెరిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 67 ఏండ్లలో గత ప్రధానులు విదేశాల నుంచి రూ. 30 లక్షల కోట్ల రుణాలను సేకరిస్తే, కేవలం పదేండ్లలోనే మోదీ సర్కారు విదేశాల నుంచి రూ. 27 లక్షల కోట్లను అప్పుగా తీసుకొంది.
ప్రశ్న: విదేశీ అప్పులు పెరుగుతుండటంతో భారత్‌పై ఏమైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నదా?
గ్రోక్: విదేశీ అప్పులు పెరుగుతుండటం ఆందోళనకరమే. రుపాయి పతనం, ట్రంప్ తాజా సుంకాలతో ఎగుమతుల్లో తగ్గుదల, ప్రపంచ దేశాల ఆర్థిక అనిశ్చితులు విదేశీ అప్పుల చెల్లింపుల్లో సవాళ్లను సృష్టించవచ్చు. అయితే, దీని ప్రభావం వెంటనే లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం నష్టాన్నే కలిగిస్తుంది.
మోదీ హయాంలో అప్పులు ఇలా