Kaleshwaram | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్ధకమైన ఆస్తులు పెంచుకుంటూ, వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం మా వి ధానం కాదు’ అని ప్రకటించింది. ఈ లెక్కన ఆ ప్రాజెక్టు పనులను సైతం పూర్తిగా అటకెక్కించేందుకు సిద్ధమైందని నిపుణులు అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా అభివర్ణించిన ప్రభుత్వం, మరోవైపు ప్రాణహిత- చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామని ప్రకటించడంపై ఇరిగేషన్‌శాఖ అధికారులే నవ్వుకుంటున్నారు. వాస్తవంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు మాత్రమే వ్యత్యాసం. అటు తరువాత ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన నీటి పంపిణీ వ్యవస్థ అంతా ఒక్కటే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే వాటిని ప్రతిపాదించారు. అందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి, ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించినా తిరిగి యథావిధిగా అదే వ్యవస్థను మిడ్‌మానేర్, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను వినియోగించుకోవాల్సిందేనని ఇంజినీర్లు చెప్తున్నారు.
ప్రభుత్వం ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ, మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రా జీవ్భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎ స్సారెస్పీ ఇందిరమ్మ వరద కాలువ, దేవాదు ల, కుమ్రంభీం, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో రాజీవ్‌భీమా, వరదకాలువ, కుమ్రంభీం, దే వాదులలను ఇప్పటికే సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేర్చి ఆ పనులను నిర్వహిస్తున్నది. మిగతా ప్రాజెక్టులు ఇతరత్రా వాటికి ఈ బడ్జెట్లో మొత్తం రూ. 28,024 కోట్లను ప్రతిపాదించింది. అయితే ఇరిగేషన్‌శాఖలో పెండింగ్ బిల్లులే దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా ఉన్నాయి.