హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరత విలయతాండవం చేస్తున్నది. బస్తా ఎరువు కోసం రైతులు పడరాని గోస పడుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారు. యూరియా కొరత, రైతులు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం తీరుపై వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం గోపడుతుటుంటే సీఎం రేవంత్ మాత్రం నింపాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొంటే ఇప్పటివరకు సీఎం ఒక్కసారికూడా ప్రత్యేకంగా సమస్యపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం అధికారులను పిలిపించుకొని పరిస్థితిపై ఆరా తీసిన సందర్భాలు కూడా కనిపించడం లేదని చెప్తున్నారు.
రెండు నెలల క్రితం రాజకీయ వ్యవహారాలపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. పనిలో పనిగా కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం ఇచ్చారని, మరోసారి కేంద్ర మంత్రుల్ని కలిసి అభ్యర్థించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏదో అడగాలి కాబట్టి అడిగాం.. వాళ్లు ఇస్తే ఇవ్వని.. లేదంటే లేదు అనే విధంగా సీఎం వ్యవహార శైలి ఉందనే విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం రాష్ట్రంలో అయినా పరిస్థితిపై సమీక్ష నిర్వహించకపోవడడం అంటే ఎంత నిర్లక్ష్యమని నిప్పులు చెరుగుతున్నారు. జులై 21న వర్షాలు, పంటలు, కొత్త రేషన్‌కార్డుల జారీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా సమస్యపై నాలుగు వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన దాఖలు లేవని గుర్తుచేస్తున్నారు. అయితే మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖలపై సమీక్షించినా రైతులోకం అట్టుడుకిపోతున్నా ఎరువుల కొరతపై సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇది ఆయన చిత్తశుద్దికి నిదర్శమని విమర్శలు గుప్పిస్తున్నారు.
రైతుల గోస… పట్టింపు లేని సీఎం!
రాష్ట్రంలో పదేండ్లలో ఎప్పుడూ లేని విధంగా యూరియా కొరత నెలకొన్నది. సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ముందుండి నడిపించాల్సి ఉంటుంది. గతంలో కేసీఆర్.. సీజన్‌కు ముందు నుంచే యూరియా నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యవసాయశాఖ మంత్రికి, అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయమే సీఎం రేవంత్‌రెడ్డి మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సీఎంకు పట్టింపులేదని వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వ్యవసాయం వదిలి… రాజకీయం ఏంది?
రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే వారిని వదిలేసి… సీఎం రేవంత్‌రెడ్డి నింపాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యతో తనకు సంబంధంలేదన్నట్టుగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారం మోపారని వ్యవసాయశాఖలో అధికారుల మధ్య చర్చ జరుగుతున్నది. యూరియా సమస్యను వ్యవసాయశాఖపై మోపి.. తాను మాత్రం బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం, ఘోష్ కమిషన్, ఢిల్లీ పర్యటనలు అంటూ రాజకీయాలు చేసుకుంటున్నారని మార్క్‌ఫెడ్‌లోని ఓ కీలక అధికారి అసహనం వ్యక్తం చేశారు. సీఎం ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. సీఎంకే రైతుల గోస పట్టకపోతే.. తాము మాత్రం ఏం చేస్తాం.. ఎంతని చేస్తామంటూ అధికారులు నిట్టూర్చడం గమనార్హం.